రండి మా దేశంలో వజ్రాలు తవ్వండి...!
తమ దేశంలో వజ్రాల గనుల తవ్వకాల కోసం ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలని భారతీయ కంపెనీలను అంగోలా దేశం ఆహ్వానిస్తోంది. వజ్రాల గనులు, చమురు నిక్షేపాలు ఉన్నా ఆ దేశంలో పేదరికం ఎందుకు ఉంది. ఆఫ్రికాలోని అంగోలా దేశంలో వజ్రాల గనులు లెక్కలేనన్ని ఉన్నాయి. వజ్రాలను అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేసే జాబితాలో అంగోలాది మూడో స్థానం. దేశంలోని 40 శాతం గనులను అక్కడి ప్రభుత్వం గుర్తించగలిగింది. అయితే ఇంకా 60 శాతం గనులను కనుగొనలేదు. అపార సంపదను తవ్వకాల చేపట్టలేదు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులను ఆ దేశం ఆకర్షించలేకపోతోంది. అయితే తమ దేశంలో వజ్రాల గనుల తవ్వకాలకు, ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశం భారతీయ కంపెనీలను ఆహ్వానిస్తోంది. వజ్రాల గనుల తవ్వకాల్లో భారత సంస్థల ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అంగోలా నిరీక్షిస్తోంది. 'దేశంలోని వజ్రాల గనులను పూర్తిగా వినియోగించుకోవాలని అంగోలా అనుకుంటోంది. ఇందుకోసం భారతీయ సంస్థల సాయం కోరుతోంది. ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తోంది' అని అంగోలాలో ఇండియా అంబాసిడార్ ప్రతిభా పార్కర్ చెప్పారు.
ఒకవేళ భారత సంస్థలు వస్తే వజ్రాల ఉత్పత్తి 9 మిలియన్ క్యారట్స్ నుంచి 15 మిలియన్ క్యారట్స్ కు చేరుతుందని అంగోలా ఆకాంక్షిస్తోంది. భారత్కు చమురు, వజ్రాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రెండో ఆఫ్రికా దేశంగా అంగోలా ఉంది. 2019-20లో 6.01 మిలియన్ డాలర్ల ముడి వజ్రాలు అంగోలా నుంచి ఇండియా దిగుమతి చేసుకుందని, ఎగుమతులు మాత్రం 0.01 మిలియన్ డాలర్లుగా ఉందని పార్కర్ వెల్లడించారు. పేదరికం ఎందుకంటే, వజ్రాల గనులు, చమురు నిక్షేపాలు ఉన్నా అంగోలాలో పేదరికం అధికంగా ఉండడానికి ప్రధాన కారణం అవినీతి.
అక్కడి ప్రభుత్వంలో పెచ్చుమీరిన అవినీతి వల్ల అధిక శాతం మంది ప్రజలకు కనీసం ఆహారం కూడా అందడం లేదు. అలాగే వ్యవసాయం సరిపడా లేకపోవడం ఆ దేశం పేదరికంలో కొట్టుమిట్టాడడానికి మరోకారణం. ఇక నిరక్షరాస్యత వల్ల కూడా ఎంతో మంది వెనుకబాటుకు గురయ్యారు. యుద్ధాల వల్ల కలుగుతున్న కష్టాలు కూడా ఆ దేశానికి తీరని నష్టం చేస్తోంది. మొత్తంగా ఎంతో విలువైన నిక్షేపాలు ఉన్నా.. అంగోలా మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నది.
