నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం...!
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలో క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేసింది ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంది. దాని ప్రకారం ముందుగా 9,10 తరగతులు.. ఆ తర్వాత మిగిలిన తరగతులను గ్యాప్ ఇచ్చి, దశల వారీగా క్లాసులను రీ-ఓపెన్ చేయాలని షెడ్యూల్ ఖరారు చేసుకుంది. ఇక, ఇవాళ్టి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది ఏపీ విద్యాశాఖ. ఇప్పటికే విద్యా శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో స్కూళ్ల రీ-ఓపెన్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఇప్పుడూ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
ఎనిమిదో తరగతి క్లాసులు నిర్వహించాలని నిర్ణయించడంతో పదో తరగతి క్లాసుల నిర్వహణ విషయంలో కొంత మేర షెడ్యూల్లో మార్పులు చేశారు. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యేలా షెడ్యూల్ మారింది. ఇక నుంచి పదో తరగతి విద్యార్థులు ప్రతి రోజూ స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి 1-5 తరగతులను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
