సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి...!
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి... కన్నడ భాష రాకపోవడమే కారణమా?
ప్రముఖ గాయని మంగ్లీ కర్నాటకలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా తాను ప్రయాణిస్తున్న కారుపై రాళ్ళదాడి జరిగింది.
నిన్న రాత్రి బళ్ళారిలోని మున్సిపల్ గ్రౌండ్స్ లో జరిగిన బళ్ళారి ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొని ఆమె తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.
ఈ దాడిలో మంగ్లీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
అయితే ఈ దాడికి రెండు కారణాలు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె కన్నడంలో పాటలు పాడిన తర్వాత తెలుగులో మాట్లాడగా, కన్నడంలో మాట్లాడాలని యాంకర్ అడగారు. అయితే ఆమె కన్నడంలో మాట్లాడలేకపోయారు. దాంతో, మంగ్లీపై విమర్శలు వచ్చాయి.
రెండేళ్ల నుంచి కన్నడ చిత్ర పరిశ్రమలో ఉంటూ కన్నడలో మాట్లాడకపోవడం ఏంటని విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారికి కన్నడ చిత్ర పరిశ్రమలో ఎందుకు అవకాశాలు ఇస్తారు? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
రెండేళ్ళుగా శాండిల్ ఉడ్ లో పాటలు పాడుతూ కూడా కన్నడం నేర్చుకోకపోవడంపై ఆగ్రహం చెందిన కొందరు యువకులు ఈ దాడి చేశారని కొందరు చెప్తుండగా, మరికొందరు మాత్రం మంగ్లీ మేకప్ టెంట్ లో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు కొందరు యువకులు వచ్చారని, వారిని పోలీసులు అడ్డుకున్నారని ఆ కోపంతోనే ఆదాడి చేశారని మరో వాదన వినిపిస్తున్నారు.
మంగ్లీ కారుపై రాళ్ళ దాడి జరగడానికి ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి అయి ఉంటుందా లేక మరేదైనా కారణముందా అనేది పోలీసు విచారణలో కాని తేలే అవకాశం లేదు.
