తైవాన్ను బిగపట్టిన అమెరికా, చైనా!
తైవాన్ను బిగపట్టిన అమెరికా, చైనా!
తైవాన్ పసిఫిక్ మహాసముద్రంలో ఓ ద్వీపం. ఇది దక్షిణ చైనాసముద్రానికి దగ్గరగాఉండటం వల్ల ఈ ద్వీపం తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది.ఈ ద్వీపాన్ని జపాన్ 1947లో చైనాకి విడిచి వెళ్ళారు.
ఈ ద్వీపంలో ప్రజల సంస్కృతి, భాష, అలవాట్లు చైనీస్‌కి దగ్గరగా ఉన్నా, తైవానీయులంతా స్వతంత్ర కాంక్షను కలిగి ఉన్నారు. అది చైనాకి నచ్చలేదు. చైనాలో అంతర్భాగంగా కొనసాగాలని కొనసాగేవారిని చేరదీసి చైనీస్ ప్రభుత్వం అక్కడ అశాంతిని సృష్టిస్తోంది.తైవానీయులు ప్రజాస్వామ్య ప్రియులు,నిజానికి ప్రజాస్వామ్య పాలనలోనే తైవాన్ బాగా అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దం నుంచి శరవేగంగా సాగుతున్న తైవాన్ అభివృద్ధిని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిని తైవాన్ మిరాకిల్‌గా అభివర్ణిస్తుంటారు. సింగపూర్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌లతో కలిసి తైవాన్ను కలిపి ఫోర్ ఆసియా టైగర్లుగా కూడా అభివర్ణిస్తుంటారు. ఎక్కడసహజవనరులు, అభివృద్ది ఉన్నాయో వాటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడం అమెరికా మొదటినుంచి అనుసరిస్తున్న విధానం. ఉదాహరణకు ముడి చమురు లభ్యతను బట్టి ఇరాన్, ఇరాక్‌ల సమీపంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడి వనరులను కొల్లగొట్టుకుని పోయేందుకు అమెరికా ప్రయత్నిస్తుండటం వల్లనే మధ్య ఆసియాలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
అలాగే, హాంకాంగ్, సింగపూర్లలో కూడా వాణిజ్యవ్యాప్తిలో భాగస్వామ్యాన్ని కోరేందుకు అమెరికా తరచూ గొడవలు పడుతోంది. ఇప్పుడు అమెరికా దృష్టి తైవాన్‌పై పడింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమనీ, దాని జోలికి వస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని చైనా హెచ్చరించినా అమెరికా లెక్కచేయడం లేదు. దక్షిణ చైనా సముద్రంలోవియత్నాం, తైవాన్ తదితర దేశాల దీవులను కూడా తమవేనని చైనా బుకాయిస్తోంది. ఈ దీవుల్లో చమురు, అపారమైన ఖనిజ సంపద ఉన్నాయి. అయితే, ఈ దీవుల్లోని ఖనిజ, చమురు సంపదపై అమెరికా దృష్టి పడింది. దాంతో చైనా, అమెరికాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. తైవాన్‌ని తమ దేశంలో కలిపేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చైనా భావిస్తోంది. తైవాన్‌లో చైనీస్ భాష మాట్లాడేవారూ, చైనా సంస్కృతికి దగ్గరగా ఉండేవారి సహకారంతో తైవాన్‌ని చైనా కబళించే ప్రయత్నాలు చాలా కాలం క్రితమే ప్రారంభించింది. అదే మాదిరిగా హాంకాంగ్‌ని కూడా తమ దేశంలో అంతర్భాగంగా చైనా వాదిస్తోంది. చైనా పెత్తనానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో కూడా ప్రజాస్వామ్య వాదులు ఉద్యమాలు చేస్తున్నారు.ముఖ్యంగా పౌరసత్వం విషయంలో హాంకాంగ్ వాదులు చాలా పట్టుదలతో ఉన్నారు. హాంకాంగ్ ఉద్యమకారులకు కూడా అమెరికా మద్దతు ఇస్తోంది. అదే మాదిరిగా తైవాన్ ఉద్యమకారులకు కూడా అమెరికా మద్దతు ఇస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికా పార్లమెంటు అధ్యక్షురాలు నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా సం చలనాన్ని సృష్టించింది. తైవాన్‌లో అడుగు పెడితే సహించేది లేదు ఖబడ్దార్ అంటూ అమెరికాను చైనా హెచ్చరించింది. అయితే, చైనా హెచ్చరికలను పెలోసీ బేఖాతరు చేస్తూ మంగళవారం రాత్రి తైవాన్ రాజధాని తైపీలో ప్రవేశించారు. తైవాన్‌లో ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు అమెరికా పూర్తి సాయాన్ని అందిస్తుందని ఆమె ప్రకటించారు. ఆమె ఐరన్ లేడీగా ప్రసిద్ధి చెందారు. ఆమె ట్రంప్ హయాంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాస్వామిక వ్యవస్థపరిరక్షణ కోసం ఎక్కడ ఆమె అవసరం ఉంటుందో అక్కడికి అమెరికన్ పాలకులు పంపుతూ ఉంటారు.
తైవాన్‌లో అమెరికా జోక్యాన్ని ప్రతిఘటిస్తూ చైనా యుద్ధానికి దిగితే, ఉక్రెయిన్, రష్యా యుద్ధకన్నా ఈ ప్రాంతంలో తీవ్ర ప్రభావం ఉటుంది. ముఖ్యంగా, చమురు రవాణాపై తీవ్ర ప్రభావం ఉండవచ్చు. చైనా, తైవాన్‌ల నుంచి ఎగుమతి, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతే సెమి కండక్టర్లతోపాటు ముఖ్యమైన వస్తువుల కొరత ఏర్పడవచ్చు. అలాగే, తైవాన్‌పై ఎన్నో అంశాల్లో ఆధారపడిన చైనా కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. చైనా ఎంత అభివృద్ది సాధించినా, ముడి సరకుల విషయంలో తైవాన్‌పై ఆధారపడే ఉంది. మన దేశం తైవాన్‌తో అనధికార దౌత్యాన్ని నెరపుతోంది. సెమీ కండక్టర్లను తైవాన్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. తైవాన్ సాధించిన అభివృద్ధిని చూసే తైవాన్‌ని తమ దేశంలో అంతర్భాగంగా ప్రకటించుకుంటోంది. తైవాన్‌కి మన దేశం అండగా నిలిస్తే చైనాతో సరిహద్దు సమస్యలు మరింత తీవ్ర తరం కావచ్చు. మొత్తం మీద తైవాన్ కోసం చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే ఆ రెండు దేశాలకే కాకుండాయావత్ ప్రపంచ దేశాలకూ సమస్యలు ఎదురవుతాయి.
