రష్యాకు తిక్కరేగితే క్రూడ్ $380కు చేరొచ్చు, కొంప కొలంబో కావచ్చు!
రష్యాకు తిక్కరేగితే క్రూడ్ $380కు చేరొచ్చు, కొంప కొలంబో కావచ్చు!
ఉక్రెయిన్ భుజం మీద గన్ను పెట్టి రష్యాతో యుద్ధం చేస్తున్న అమెరికా, యూరోప్ దేశాలు.. ఆర్థిక ఆంక్షలనూ విధించాయి. రష్యన్ చమురును దిగుమతి చేసుకోకుండా ఆపాయి.
ఈ రెండు మదపటేనుగుల పోట్లాట వల్ల ద్రవ్యోల్బణం పెరిగి అమాయక, అబల జీవాలైన అభివృద్ధి చెందుతున్న దేశాలు నలిగిపోతున్నాయి.
చమురు దిగుమతుల్ని నిలిపేశామంటూ పశ్చిమ దేశాలు జబ్బలు చరుచుకున్నాయి గానీ, రష్యాకు తిక్క రేగి చమురు ఉత్పత్తిని నిలిపేస్తే పరిస్థితేంటి? తత్పరిణామాలు మన ఊహక్కూడా అందవు.
ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తిని పెంచడానికి ససేమిరా అంటున్నాయి. దీంతో ఇప్పటికే చమురు రేట్లు ఆకాశంలో ఉన్నాయి.
ఒకవేళ రష్యా చమురు ఉత్పత్తిని ఆపేస్తే... బ్యారెల్ క్రూడ్ $380కి చేరుకుంటుందన్నది జేపీ మోర్గాన్ అంచనా. ఇదే జరిగితే చమురు కోసం మళ్లీ యుద్ధాలు మొదలవుతాయి, కొంప కొలంబో అవుతుంది.
నెలల తరబడి యుద్ధం జరుగుతున్నా రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉంది. అది ఇంకా ఎక్కువగా దెబ్బతినకుండా, రోజువారీ క్రూడ్ ఉత్పత్తిని 5 మిలియన్ బ్యారెల్స్ వరకు రష్యా తగ్గించగలదు.
ప్రస్తుతం క్రూడ్ రేట్ బ్యారెల్‌కు $110 దగ్గర ఉంది.
ఒక్క రోజు సరఫరాలో 3 మిలియన్ బ్యారెళ్ల కోత పడిందంటే, క్రూడ్ రేటు $190కు పెరుగుతుంది. అదే 5 మిలియన్ల దెబ్బ పడితే.. $380 "స్ట్రాటోస్పియర్"లోకి క్రూడ్ చేరుతుందని జేపీ మోర్గాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఇది వాస్తవ రూపం దాలిస్తే, ప్రపంచ వినాశనాన్ని మన తరం కళ్లజూడాల్సి వస్తుంది.
కాబట్టి జేపీ మోర్గాన్ వ్యాఖ్యల్లోని వ్యంగ్యాన్ని పక్కనబెట్టి, సీరియస్‌నెస్‌ని; బంతి రష్యా కోర్టులో ఉందన్న వాస్తవాన్ని మనం అర్ధం చేసుకోవాలి.
స్పష్టీకరణ: పైన పేర్కొన్న సమాచారం నిపుణులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు మాత్రమే. దీనితో ప్రాఫిట్ మాస్టర్ వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టేముందు లేదా వెనక్కు తీసుకునే ముందు మార్కెట్ నిపుణుల సలహా తీసుకుని, ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ముందడుగు వేయమని మా విజ్ఞప్తి.
