రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు
రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు
-కీవ్‌పై వ్లాదిమిర్ పుతిన్ ఆరోపణ
-కాల్పులకు పాల్పడిందని వెల్లడి
మాస్కో: ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు.
ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కర్స్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్య ప్రవేశించినట్టు రష్యా రక్షణ శాఖ సైతం ఆరోపించింది. రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తమ భూభాగంలోకి ప్రవేశించిందని రష్యా ఆరోపించడం ఇదే మొదటిసారి. సడ్ఝా పట్టణం వద్ద ఒకేసారి ఉపరితలం, వాయు మార్గాల్లో ఉక్రెయిన్ దాడికి పాల్పడినట్టు రష్యా అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, ఇంకా రష్యా భూభాగంలోనే ఉక్రెయిన్ సైన్యం ఉందా అనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఉక్రెయిన్ కూడా ఈ విషయంపై స్పందించలేదు.
ట్రంప్ హత్యకు పాకిస్థానీ కుట్ర
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరో ఇద్దరు రిపబ్లికన్ నేతలను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. తమ దేశ నేతలను కిరాయి వ్యక్తులతో హత్య చేయడానికి కుట్ర జరిగిందని, దీని వెనుక ఇరాన్ హస్తం ఉందని ఎఫ్‌బీఐ ఆరోపించింది. ఈ కుట్రకు సంబంధించిన ఒక పాకిస్థాన్ దేశస్థుడిని అరెస్ట్ చేసినట్టు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ మంగళవారం వెల్లడించింది.