Top Ad unit 728 × 90

యుద్ధోన్ముఖంగా జపాన్‌!

యుద్ధోన్ముఖంగా జపాన్‌!

 

రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జపాన్‌ మిత్ర దేశాల కూటమి నిర్దేశించిన మేరకు మిలిటరీ బదులు ఆత్మ రక్షణ దళాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించు కుంది.

 

ఇటీవలి కాలంలో అక్కడి పాలకవర్గం తిరిగి మిలిటరీని ఏర్పాటు చేయాలని, రణతత్పర దేశంగా మారాలని, ప్రపంచ రాజకీయాల్లో తన వంతు పెత్తనం చెలాయించాలని చూస్తున్నది. బుధవారం నాడు వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌-జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా బలమైన రక్షణ సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిజ్ఞఆ దిశలో వేసిన ముందుడుగు, ప్రపంచానికి ప్రమాద ఘంటిక మోగించినట్లుగా భావించాలి. చైనాను అడ్డుకోవటం ఈ దేశాల దీర్ఘకాలిక వ్యూహమే అయినప్పటికీ దాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించు కొనేందుకు కూడా చూస్తున్నారు. జపాన్‌ ప్రధాని కిషిడా మీద జనంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఇటీవలి సర్వేలు వెల్లడించాయి. నవంబరులో జరిగే ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో జో బైడెన్‌ తీవ్ర సవాలును ఎదుర్కొంటున్నాడు. ఈ పూర్వ రంగంలో జనం దృష్టిని మళ్లించేందుకు చైనా బూచిని చూపారని కూడా భావిస్తున్నారు.

 

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం లేదా మరెక్కడైనా యథాతథ స్థితిని మార్చేందుకు బలప్రయోగం లేదా ఒత్తిడి ద్వారా ఎవరైనా ప్రయత్నిస్తే దృఢంగా ఎదుర్కొంటామని ఇరువురు నేతలు అన్నారు. చైనాతో సవాళ్లను ఎదుర్కొనేందుకు చేస్తున్న కృషిని కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ ఈ రోజు రష్యా దురాక్రమణకు గురైంది. రేపు తూర్పు ఆసియా కావచ్చని జపాన్‌ ప్రధాని ఆరోపించాడు. త్వరలో అమెరికా, జపాన్‌, బ్రిటన్‌ మిలిటరీ విన్యాసాలు జరపనున్నాయని, అవి ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని జో బైడెన్‌ అన్నాడు. ఒంటరిగా లేదా మరో దేశంతో కలసి ఎవరు సైనిక విన్యాసాలు జరిపినా, వాటిలో భాగంగా ఆయుధ ప్రయోగాలు, ప్రదర్శనలు చేసినా అది బల ప్రదర్శన, కొన్ని దేశాలను భయపెట్టేందుకు తప్ప మరొకటి కాదు. బుధవారం నాడు రెండు దేశాల అధినేతలు చేసిన ప్రకటనలు ఏదో ఆకస్మికంగా చేసినవి కాదు. మరింత దూకుడుగా మిలిటరీ కూటమిని మార్చేందుకు ఏడాది క్రితమే అమెరికా-జపాన్‌ చేసిన ప్రకటనను జపాన్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. అమెరికా మిలిటరీ కమాండ్‌ ఆధీనంలో జపాన్‌ స్వయం రక్షక దళాలను ప్రతిదాడులు చేసేవిగా, ఇతర సామర్ధ్యాలను పెంచేందుకు చూస్తున్నారని, అవసరమైనపుడు శత్రుదేశాలను దెబ్బ తీస్తామని బహిరంగంగా చెప్పటమేనని కూడా పేర్కొన్నది. ఇప్పటి వరకు ఉన్న ఇరు దేశాల ఒప్పందానికి ఇది పూర్తి వ్యతిరేకమని కమ్యూనిస్టు పార్టీ చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తీసుకున్న విధానాన్ని కేవలం ఒక మంత్రివర్గ తీర్మానంతో మార్చివేస్తున్నారని, పార్లమెంటును, దేశ ప్రజలను సంప్రదించలేదని విమర్శించింది. హిరోషిమా, నాగసాకి ఉదంతాలను చూసిన తరువాత మరోసారి తమ దేశం మిలిటరీ శక్తిగా మారకూడదని, శాంతికి ముప్పు తేకూడదని జపనీయులు భావిస్తున్నారు.

 

తమను చక్రదిగ్బంధనం చేసేందుకే ఇదంతా అని చైనా భావిస్తున్నది. దానికి అనుగుణంగా తన మిలిటరీ శక్తిని అది మెరుగు పరుచుకుంటున్నది. తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ దాన్ని బలవంతంగా విలీనం చేసుకొనేందుకు అంగీకరించేది లేదని అమెరికా, దాన్ని సమర్దించే దేశాలు ఒకవైపు పదే పదే చైనాను రెచ్చగొడుతున్నాయి. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని దీవులను ఆక్రమించుకొనేందుకు చైనా పూనుకున్నదని, నౌకా రవాణా స్వేచ్ఛగా జరిగేందుకు అవరోధాలు సృష్టిస్తున్నదనే ఆరోపణలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చ గొడుతున్నాయి. చైనా ఆధీనంలోని కొన్ని దీవులు తమవంటూ ఫిలిప్పైన్స్‌ ఇటీవల వాటిలో ప్రవేశించేందుకు చూడటం దానిలో భాగమే. ప్రబల అర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బతీసేందుకు అమెరికా దీర్ఘకాలంగా పన్నుతున్న వ్యూహాలలో జపాన్‌ కీలకమైనది. వర్తమాన రాజ్యాంగం ఉనికిలో ఉన్నంత వరకు జపాన్‌ ఏ మిలిటరీ కూటమిలోనూ చేరేందుకు అవకాశం లేదు. అందుకే పక్కదారులు వెతుకుతున్నారు. జపాన్‌ మీద అమెరికా రుద్దిన రక్షణ ఒప్పందం పేరుతో అమెరికా మిలిటరీ అక్కడ తిష్టవేసింది. చతుష్టయ భద్రతా సంప్రదింపులు (క్వాడ్‌) పేరుతో అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా ఒక కూటమిగా ఉండగా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా (అకుస్‌) మరో కూటమిగా ఏర్పడ్డాయి. దీనిలో జపాన్‌ను చేర్చేందుకు అడ్డదారి వెతుకుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఆసియాలో ప్రత్యేకించి తూర్పు ఆసియాలో ఆందోళన కలిగిస్తున్నాయి.

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

యుద్ధోన్ముఖంగా జపాన్‌!

యుద్ధోన్ముఖంగా జపాన్‌! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *