ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ భార్య ఏమైనట్లు…?
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ భార్య ఏమైనట్లు…?
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను తేనెపూసిన కత్తి లాంటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. ఎందుకంటే పైకి అమాయకంగా కనిపించే ఆయన... మనుషుల్ని చంపించడంలో ఏమాత్రం వెనకాడడు. ఏ చిన్న డౌట్ వచ్చిన చాలు, అత్యంత నమ్మకమైన వ్యక్తులను, కుటుంబ సభ్యులను కూడా చంపిస్తాడు. అదికూడా అత్యంత కిరాతకంగా. తన నీడనే నమ్మలేని ఒక రకమైన శాడిస్టు ఆయన అంటారు చాలా మంది. తాజాగా ఆయన భార్య రి సోల్ జు విషయం కలకలం రేపుతోంది. ఏడాది నుంచి ఆమె కనిపించట్లేదు. ఎప్పుడో జనవరి 25, 2020లో చివరిసారి తన భర్తతో కలిసి, రాజధాని ప్యాంగ్యాంగ్లో ఓ థియేటర్ దగ్గర దేశ ప్రజలకు కనిపించారు. అప్పటి నుంచి మళ్లీ కనిపించినది లేదు. ఈ విషయంపై ఇంటర్నెట్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించడం వల్లే ఆమె బయటకు రావట్లేదనే వాదన కొందరు చేస్తుంటే... కరోనా వైరస్ తనకు సోకకూడదు అనే ఉద్దేశంతోనే స్వయంగా ఆమే బయటకు రావట్లేదనే వాదన మరికొందరు చేస్తున్నారు. దీనిపై నార్త్ కొరియా రీసెర్చ్ డివిజన్ డైరెక్టర్ హాంగ్ మిన్ స్పందించారు. ఆమె కరోనా కారణంగానే బయటకు రావట్లేదని. పిల్లల బాధ్యత చూసుకుంటున్నారని చెప్పారు. అంతెందుకు కిమ్ జోంగ్ ఉన్ కూడా పెద్దగా బయటకు కనిపించట్లేదు కదా, అందుకు కారణం కరోనాయే అని చెప్పారు.
ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ ఆంటీ కిమ్ యుంగ్ హీ అనారోగ్యంతో ఉన్నారు. రి సోల్ జు ఆమెకు సేవలు చేస్తూ ఉండొచ్చనే వాదన కూడా ఉంది. కొంత మంది రి సోల్ జు పెద్ద కూతురు జు ఎయ్ చదువుపై ఫోకస్ పెట్టి ఉంటారని అంటున్నారు. ఐతే, ఇవేవీ కాదనీ రి సోల్ జుకి ఏదో తీవ్ర అనారోగ్యం వచ్చిందనీ అందువల్లే ఆమె బయటకు రావట్లేదని కొందరు అంటున్నారు.
ఉత్తర కొరియాలోని ఉత్తర ప్రావిన్స్ హామ్యోంగ్కి చెందిన రి సోల్ జుని 2009లో పెళ్లి చేసుకున్నాడు కిమ్ జోంగ్. ఐతే, 2012లో ఆమెను కిమ్ జోంగ్ భార్యగా ఆ దేశ మీడియా ప్రకటించింది.
ట్విట్టర్లో రి సోల్ జు పేరుతో ఓ అకౌంట్ ఉంది. అందులో మాత్రం తన గురించి ఆందోళన చెందవద్దనీ, తాను క్షేమంగా ఉన్నాననీ, ఇంట్లోనే ఉంటూ సమయం గడుపుతున్నానని ట్వీట్ ఉంది. ఈ ట్వీట్ జనవరి 28, 2021న చేసినది. ఐతే, ఈ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ కాదు. ఇది నిజమైనదో కాదో ట్విట్టర్ క్లారిటీ ఇవ్వలేదు. అందువల్ల ఈ ట్వీట్ నిజంగానే రి సోల్ జు చేశారా లేక ఇంకెవరైనా ఇలాంటి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది.
గతేడాది అక్టోబర్ 10న ప్యాంగ్యాంగ్లో ఓ మిలిటరీ పరేడ్ జరిగింది. ఆ కార్యక్రమానికి రి సోల్ జు రాలేదు. దాంతో అప్పటి నుంచి ఆమెపై రకరకాల వదంతులు వస్తున్నాయి.
