ప్రధానితో మమత సమావేశం.
ప్రధానితో మమత సమావేశం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సమావేశం అయ్యారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన మమత దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయనను కలుసుకున్నారు.
ఆదివారం జరిగే నీతి అయోగ్ సమావేశానికి సైతం దీదీ హాజరు అవుతారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నిక శనివారం ఉన్న నేపథ్యంలో మోదీతో సమావేశం చర్చనీయాంశం అవుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు పోటీగా టీఎంసీ నుంచి యశ్వంత్ సిన్హాను పోటీకి దింపిన మమతా బెనర్జీ తాజా ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము పాల్గొనడం లేదంటూ ప్రకటించారు.
అయితే ప్రస్తుత సమావేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. పశ్చిమబెంగాల్లో ఎస్ఎస్సీ స్కామ్‌లో మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. పరువు తీసిన పార్థాను మంత్రి పదవి నుంచి తొలగించి డబ్బుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు వాదించారు. అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పార్థా-అర్పిత లీలలు రోజుకొకటి బయటకు వస్తుండటంతో మమతకు దిక్కుతోచడం లేదు. ఈ తరుణంలో ఆమె ప్రధానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక మరో వైపు నుంచి ఆలోచిస్తే... విపక్షాలు మార్గరెట్ అల్వా ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన జగ్దీప్ ధన్కర్ ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. విభేదాలు ఉన్నప్పటికీ మమతా మద్దతును ధన్కర్ కోరినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం డార్జిలింగ్‌లో వీరిద్దిరూ సమావేశమయ్యారు. ఆ సమావేశానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే టీఎంసీ నుంచి మద్దతు కావాలని ధన్కర్ అడిగినట్లు తెలుస్తోంది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ ఎంపీలు సముఖంగా లేరట. అయితే దీనిని తనకు అనుకూలంగా తీసుకోవాలని ధన్కర్ భావిస్తున్నప్పటికీ ఈ ఎన్నికలో పాల్గొనమని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే సమయంలో ప్రధాని మోదీని మమత బెనర్జీ కలవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
