యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోడీ లక్ష్యం: ఖర్గే
యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోడీ లక్ష్యం: ఖర్గే
న్యూఢిల్లీ: యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోడీ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ధ్వజమెత్తారు.
నిరుద్యోగంపై వెలువడిన పలు సర్వేలను ఉదహరిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సంధించారు. నిరుద్యోగంపై సిటీగ్రూప్ ఇచ్చిన స్వతంత్ర ఆర్థిక సర్వేను కూడా మోడీ ప్రభుత్వం ఖండించవచ్చని ఎద్దేవా చేశారు. అయితే ప్రభుత్వ నివేదికను ఎలా తిరస్కరిస్తారని పేర్కొన్నారు. గత పదేళ్లుగా కోట్లాది మంది యువకుల కలలను చిన్నాభిన్నం చేసిన బాధ్యత మోడీ ప్రభుత్వానిదేనన్నది నిజమని స్పష్టం చేశారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ప్రకారం... తయారీ రంగంలో అన్ఇన్కార్పోరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వార్షిక నివేదిక ప్రకారం... 2015-2023 మధ్య ఏడేళ్లలో చట్టబద్ధం కాని సంస్థల్లో 54 లక్షల ఉద్యోగాలు పోయాయి. 2010-11లో భారతదేశవ్యాప్తంగా 10.8 కోట్ల మంది ఉద్యోగులు తయారీ రంగంలో, వ్యవసాయేతర ఎంటర్ప్రైజెస్లో ఉద్యోగులు పనిచేశారు. 2022-23 నాటికి ఈ సంఖ్య 10.96 కోట్లకు చేరింది. అంటే 12ఏళ్లలో 16 లక్షల స్వల్ప పెరుగుదల నమోదైందని అన్నారు. పట్టణాల్లో నిరుద్యోగ రేటు ఈ ఏడాది నాలుగవ త్రైమాసికంలో 6.7 శాతంగా ఉన్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్) వెల్లడించిందని అన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) డేటాను చూపుతూ మోడీ ప్రభుత్వం అధికారిక రంగంలో ఉపాధి కల్పనకు గండికొట్టింది. అయితే డేటా వాస్తవమేనని భావించినప్పటికీ... 2023లో కొత్త ఉద్యోగాల్లో 10 శాతం క్షీణత కనిపించిందని అన్నారు.
నిరుద్యోగం పెరుగుదల, విద్యావంతులలో అధిక నిరుద్యోగం, శ్రామిక శక్తిలో మహిళల తక్కువ భాగస్వామ్యం దేశంలో ప్రబలంగా ఉందని ప్రభుత్వ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఐఐఎం లక్నో విడుదల చేసిన సర్వేలో పేర్కొంది. స్వతంత్ర ఆర్థిక నివేదికలను మోడీ ప్రభుత్వం తిరస్కరిస్తోందని, ఎందుకంటే అవి బిజెపి ప్రభుత్వ కప్పిపుచ్చుకునే సిగ్గులేని ప్రయత్నాలను బహిర్గతం చేస్తున్నాయని అన్నారు.దేశంలో ప్రస్తుత నిరుద్యోగ రేటు 9.2 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) నివేదిక పేర్కొంది. మహిళల్లో అత్యధికంగా 18.5 శాతంగా ఉందని అన్నారు. ఐఎల్ఒ నివేదిక ప్రకారం... దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం యువత ఉన్నారు. ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం... 2012-2019 మధ్య సుమారు 7 కోట్ల మంది యువత శ్రామిక శక్తిలో చేరారు. కానీ ఉపాధిలో సున్నా వృద్ధి -0.01 మాత్రమేనని ఖర్గే పేర్కొన్నారు. దేశంలోని 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని ఖర్గే 2023 అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీ నివేదికను ప్రస్తావించారు. భారతదేశంలో ఏడాదికి 1.2 కోట్ల ఉద్యోగాలు అవసరం. 7 శాతం జిడిపి వృద్ధి కూడా యువతకు తగినంతగా ఉద్యోగాలను సృష్టించదు. మోడీ ప్రభుత్వ హయాంలో సగటున 5.8 శాతం జిడిపి వృద్ధి రేటును మాత్రమే సాధించిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేట్ సెక్టార్, స్వయం ఉపాధి లేదా అసంఘటిత రంగం ఏదైనా మోడీ ప్రభుత్వ ఏకైక లక్ష్యం యువతకు ఉపాధి లేకుండా చేయడమేనని ఖర్గే ఎద్దేవా చేశారు.
