వాయనాడ్ విధ్వంసం హృదయ విదారకం: రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
వాయనాడ్ విధ్వంసం హృదయ విదారకం: రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
కేరళలోని వాయనాడ్ విపత్తుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ... వాయనాడ్‌లో జరుగుతున్న విధ్వంసం హృదయ విదారకంగా ఉందన్నారు. నష్టపోయిన కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారం పెంచాలని, బాధిత కుటుంబాలకు వెంటనే సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు.
”ఈరోజు తెల్లవారుజామున వాయనాడ్ జిల్లాలోని ముండక్కై గ్రామంలో విధ్వంసక కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా ప్రాణ నష్టం జరిగింది. 70 మందికి పైగా ప్రజలు మరణించారు. వాయనాడ్ విపత్తు గురించి తెలియగానే కేంద్ర రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పరిహారాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కీలకమైన రవాణా కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించాలి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించాలి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. మన దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగింద”ని రాహుల్ గాంధీ అన్నారు.
అంతకంతకు పెరుగుతోన్న మృతుల సంఖ్య
కాగా, భారీ వర్షాలతో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 84 మంది ప్రాణాలు కోల్పోగా, 116 మంది గాయపడినట్టు సమాచారం. NDRF, KSDRF టీములు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.