త్వరలో సచివాలయ కొలువుల భర్తీ ప్రకటన: కలెక్టర్
త్వరలో సచివాలయ కొలువుల భర్తీ ప్రకటన: కలెక్టర్
మాట్లాడుతున్న ప్రసన్న వెంకటేశ్
ఏలూరు కలెక్టరేట్: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ కొలువుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలకు సంబంధించి రోస్టర్ పాయింట్ల వారీగా జాబితాలు సిద్ధం చేసుకోవాలన్నారు. సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తూ సెలవుల అనంతరం వారం దాటినా విధులకు హాజరుకాని వారికి తాఖీదులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అప్పటికీ స్పందించకపోతే వారి నుంచి రాజీనామా కోరడం కానీ, విధుల నుంచి తొలగించడం కానీ చేయాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన సచివాలయ సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సత్యనారాయణమూర్తి, జడ్పీ సీఈవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధువపత్రాల అందజేత: విధి నిర్వహణలో మరణించిన ఇద్దరి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ సహాయకులుగా ఉద్యోగాలు కల్పిస్తూ ధ్రువపత్రాలను సోమవారం కలెక్టర్ అందజేశారు.
