సూర్తి: అప్పుడు అన్నదాత ఇప్పుడు అవయదాత
సూర్తి: అప్పుడు అన్నదాత ఇప్పుడు అవయదాత
హైబీపీతో అపస్మారక స్థితికి చేరుకున్న ఇంటి పెద్దను రక్షించుకునేందుకు ఆ కుటుంబం ఎంతో ప్రయత్నించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంటి పెద్ద దిక్కును కాపాడుకోవాలని ఆ కుటుంబం తాపత్రయపడింది. కాని, అతడు కోలుకోవడం కష్టమని బ్రైయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. 'బ్రైయిన్ డెడ్ అయిన వ్యక్తి' విషయాన్ని ఆస్పత్రి వర్గాలు జీవన్‌దాన్ సంస్థకు తెలియజేశారు. జీవన్‌దాన్ సంస్థ సభ్యులు ఎల్బీనగర్ కామినేని దవాఖానకు చేరుకుని బ్రైయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేస్తే మరి కొందరికి ప్రాణదానం చేయవచ్చని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.
బ్రైయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరి కొందరిని రక్షించేందుకు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం, ఆరెగూడేనికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి(45) రైతు. ప్రస్తుతం మోత్కూరులో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయనకు భార్య నిర్మల, ఇద్దరు కుమారులు శశికర్రెడ్డి (12), శ్రీనాథ్‌రెడ్డి(10) ఉన్నారు. వ్యవసాయ పనులు లేనప్పుడు బోరు వాహనాలపై సూపర్వైజర్గా పని చేస్తుంటాడు. జనవరి 31న తన బైకులో పెట్రోల్ పోసుకునేందుకు మోత్కూరులోని ఓ బంకుకు వెళ్లాడు. పెట్రోల్ పోసుకున్న అనంతరం, అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆయనను వెంటనే మోత్కూరులోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. నర్సిరెడ్డిని పరీక్షించిన వైద్యులు అతడికి ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
అదేరోజు మధ్యాహ్నం ఎల్బీనగర్ కామినేని దవాఖానలో చేర్పించగా, హైబీపీతో మెదడులోని రక్త నాళాలు చిట్లి పోయినట్లుగా వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల ఒకటిన మధ్యాహ్నం నర్సిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన ఎల్బీనగర్ కామినేని వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆస్పత్రి వర్గాల ద్వారా విషయాన్ని తెలుసుకున్న జీవన్‌దాన్ సంస్థ సభ్యులు నర్సిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అవయవ దానాలు చేయడం ద్వారా మరి కొందరి ప్రాణాలను రక్షించవచ్చునని తెలిపారు. ఇందుకు నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో మంగళవారం మధ్యాహ్నం బ్రైయిన్ డెడ్ అయిన నర్సిరెడ్డి దేహంలోని గుండె, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, లివర్, రెండు కార్నియాలను సేకరించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోఖలే బృందం నేతృత్వంలో శరీర భాగం నుంచి అవయవాల సేకరణ జరిగినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
