Top Ad unit 728 × 90

గురుపుష్యయోగం ఈ చుక్కల అమావాస్య

గురుపుష్యయోగం ఈ చుక్కల అమావాస్య

 

డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గురుపుష్య యోగం, ఈ చుక్కల అమావాస్య. గురువారం పుష్యమి నక్షత్రం కలిసిరావడం చాలా మంచిది. పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి. పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగ లేదా గురుపుష్య యోగం అని అంటారు. దీన్నే గురు పుష్య అమృత యోగా అని కూడా అంటారు. గురు గ్రహం విజ్ఞానానికి సంకేతం. గురువును పవిత్రంగా భావిస్తారు. పుష్యమి నక్షత్రం శుభ్రతకు, మృధుత్వానికి చిహ్నం. అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి, పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా ఉంటుంది.

 

ఈరోజు చేసే పూజ లేదా ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మిక సాధన వలన వచ్చే ఫలితాలు అత్యధికంగా ఉంటాయి. లక్ష్మీ ప్రదమైన శ్రావణమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య కావున ఈ రోజు సాయంసంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి ముందు వీలైనన్ని ఎక్కువ దీపాలను వెలిగించి దూపమ్ వేసి పూజిస్తే అనేకానేక శుభ ఫలితాలను అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా సత్పలితం కలుగుతాయి.

 

భారతీ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు, అదే చుక్కల అమావాస్య.

 

ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు ఇతర శుభకార్యాలకు సంబంధించిన శుభ ముహూర్తాలు మొదలయ్యే కాలం. ఆవివాహితులు ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ, మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి అమ్మవారిని కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

 

ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షా కంకణాన్ని ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా 'చుక్కల అమావాస్య' పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఇందుకోసం గౌరీ పూజని చేసి సాయం సంధ్య సమయం వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. పూర్వ కాలంలో స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట.

 

దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి, ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కలకాలం బలంగా ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక. ఆషాఢ బహుళ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాలలో చాలా దీపాలతో విశేష పూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. గోమాతకు అరటిపండ్లు ఇతర గ్రాసం తినిపించి ప్రదక్షిణ చేసుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భావిస్తారు.

గురుపుష్యయోగం ఈ చుక్కల అమావాస్య Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *