శంఖుస్థాపన - శాస్త్రోక్త విధి విధానం
శంఖుస్థాపన - శాస్త్రోక్త విధి విధానం
వివరణ: డా. ఎం. ఎన్. ఆచార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151
ఆధునిక కాలంలో శంకుస్థాపన కార్యాన్ని చాలా వరకు తప్పుగా, శాస్త్ర సంబంధం లేకుండానే జరిపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటనగా వాస్తు పూజా విధానాలు స్మార్తభాగములో లేకపోవడమే. ఈ వాస్తు పూజ అనేది ఆగమశాస్త్రములో మాత్రమే చెప్పబడినది. ప్రస్తుతం శంఖుస్థాపన (కొన్ని ప్రాంతాలలో) ఎలా చేస్తున్నారో ఒకసారి గమనిస్తే ఈశాన్యంలో ఒక గొయ్యిని తీసి నవగ్రహపూజ చేసి, ఉలి/తాపి పెట్టి రెండు లేక మూడు మండపములువేసి దానిని వాస్తుపూజాగా భావిస్తున్నారు. ముహూర్త సమయానికి ఒక మూడు లేక ఐదు ఇటుకలు పెట్టి కార్యక్రమం పూర్తి చేసేస్తున్నారు. ఈ పద్దతి సాంప్రదాయ పద్దతి కానేకాదు. వైజ్ఞానికం అంతకన్నా కాదనే చెప్పాలి. మండపంలో ఉలి/తాపి పెట్టి వాటినే వాస్తు పురుషుడు అని అంటున్నారు. తాపి, ఉలి అనే వస్తువులు గృహానిర్మాణంలో ఉపయోగిస్తాము కాబట్టి పూజలో వాటిని పెట్టడం తప్పులేదు కానీ తమకు తెలియని శాస్త్ర విషయాలను కప్పిపెట్టి తాము చేసిందే సరైనదని అమాయకంగా భావించడమే పెద్ద తప్పు. శాస్త్రప్రకారం శంకువును స్థాపన చేస్తేనే శంకుస్థాపన అనబడుతుంది.
శంకువు స్వరూపం: శంకువు అనే మాటకు గుంజ అని అర్ధం. కర్రతో మలచబడిన ఒక దివ్యమైన దేవతా స్వరూపం. ఈ క్రింది విధంగా శంకువు ఉంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారం శుద్దమైన చండ్రకర్రను తీసుకుని శంకువును తయారు చేయించుకోవాలి. ఈ చండ్రకర్రనే శంకువుగా ఎందుకు ఎంచుకుంటారు అంటే ఇది భూమిలో మూడు, నాలుగు వందల సంవత్సరాల వరకు చెడిపోకుండా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ కర్రనుమన పూర్వీకులు ఎంచుకున్నారు.
శంకువు కొలతలు: ఒక అడుగు = 12 అంగుళాలు
ఒకటిన్నర అడుగు = 18 అంగుళాలు
రెండు అడుగులు = 24 అంగుళాలు
ఈ కొలతలతో ఉండాలని శాస్త్ర నిర్ణయం. శంకువు పొడవును బట్టి కింద నుండి పై భాగం వరకు కింద చూపబడిన నమూనా చిత్ర పటంలో చూపబడిన విధంగా మూడు భాగాలుగా చేయాలి. ఈ పటంలో కింద నుండి 1వ భాగంగా గుర్తించాలి. కింది భాగం నాలుగు కోణాలు ఉండేలా చూసుకోవాలి, కింద భాగం నాలుగు కోణాలు ప్రధాన దిక్కులకు ప్రతీకలుగా చెప్పబడుతుంది, ధర్మ, అర్ధ, కామ, మోక్షములుగా భావిస్తారు. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం చతుర్ముఖ బ్రహ్మగా భావిస్తారు.
2వ భాగమును (మధ్య భాగము) ఎనిమిది కోణాలుగా ఉండేలా తయారు చేసుకోవాలి. ఈ ఎనిమిది కోణాల పద్మాన్ని అష్ట దిక్కులకు ప్రతీకగా పైన ఒకటవ భాగంలో తెలిపిన పురుషార్ధాలకు (నడవడిక) గల మధ్య సంబంధము సూచిస్తుంది. అష్టాక్షరీకి అదిదేవుడైన శ్రీమహా విష్ణువుకు ప్రతీకగా భావిస్తారు.
3 భాగముపై భాగం (పై భాగం) ఇది లింగాకృతి (శివలింగం) ఆకారం కలిగి ఉంటుంది. ఆకర్షణ శక్తిని సూచించును. జగత్తు స్వరూపం, ఈ విధంగా మూడు భాగాలుగా శంకువును మలుస్తారు.
శంకువు యొక్క ప్రధాన లక్షణం ఆకర్షణ శక్తియే. లింగము అంటే ఆకర్షించేది అని అర్ధం కదా...! అందుకే మన పెద్దలు బాగుగా ఆలోచించి పూర్వం గృహాలను పెంకుటిండ్లను కోణాకారంగా నిర్మించేవారు. కొన్ని ప్రాంతాలలో శ్లాబులు కూడా కోణాకృతిగా నిర్మించినవి మనకు కనబడుతుంటాయి. ఈ పద్దతి ద్వారా ఖగోళంలో ఉండే కాంతిని కోణము ద్వారా ఆకర్షించి గృహానికి తగిన శోభను ఇచ్చి సుఖంగా మరియు ఆరోగ్యంగా జీవించే శక్తిని ప్రసాదించేది.
ప్రస్తుతం కాలంలో శ్లాబుల సిస్టమ్ వచ్చిన తర్వాత శక్తిని ఆకర్షించకపోగా ఉన్న శక్తిని నాశనం చేసుంది, అనారోగ్యాన్ని కలిగిస్తున్నది. అందుకే కనీసం శంకువును స్థాపిస్తే శక్తిని ఆకర్షించి ఆ యింట శుభాన్ని ప్రసాదిస్తుంది. దీన్ని బట్టి చూస్తే శంకుస్థాపన అనేది పూర్వకాలం కంటే ప్రస్తుత కాలంలో చాలా అత్యంత అవసరం అనిపిస్తుంది.
శంకు స్థాపన ప్రదేశాన్ని ఎలా గుర్తించాలి
శంకుస్థాపన ఎక్కడ చేయాలి...? ఏ ప్రదేశంలో చేయాలి...? అనేక సందేహాలు సహజంగా కలుగుతూ ఉంటుంది. శాస్త్ర ప్రకారం శంకువును నాభి స్థానంలో స్థాపన చేయవలెనని సూచించినది. మరి ఈ నాభి స్థానాన్ని ఎలా గుర్తించాలి అనే సందేహం వచ్చి తీరుతుంది. మనకు ఉన్న ఇంటి స్థలంలో నిర్మాణానికి ముగ్గు వేస్తారు కదా. ఆ నిర్మాణం చేపట్టాలనుకున్న స్థలంలో నైరుతి నుండి ఈశాన్యం వరకు ఒకలైన్ వేసుకుని దానిని 28 సమ భాగాలుగా చేసుకోవాలి. నైరుతి దిక్కు వాస్తు పురుషుని పాదస్థానం నుండి 10 భాగాలు వదిలి 11 భాగంలో ఒక మార్కు గీసుకోవాలి. ఆ తర్వాత ఈశాన్యం మూల నుండి వాస్తు పురుషుని శిరస్సు భాగం నుండి 17 భాగాలు వదలి 18 వ భాగమే వాస్తు పురుషుని నాభి స్థానం అవుతుంది. ఈ భాగంలో శంకువును స్థాపన చేయాలి.
ఏ జీవికైనా నాభి స్థానంలో ప్రాణశక్తి ఉంటుంది. ఈ స్థానానికి దగ్గరలో మూలా ‘ప్రధాన’ ధార చక్రం ఉంటుంది. బుద్ధికి కారకుడైన వినాయకుడు కూడా ఇక్కడే ఉంటాడని పెద్దలు చెబుతూ ఉంటారు.
నాభి స్థానం గుర్తించుటకు ఇంకో సులువైన మార్గం కూడా ఉంది. నైరుతి నుండి ఈశాన్యం వరకు కొలిచి దానిని మొత్తం తొమ్మిది భాగములు చేసుకుని నైరుతి నుండి 4 భాగములు, ఈశాన్యం నుండి 5 భాగములు కొలువగా ఎక్కడైతే రెండు బిందువులు కలుస్తాయో అదే నాభి స్థానం అవుతుంది.
అందుకే అన్నారు నోటి నుండి వచ్చే మాటలు మోసపూరితమైనవని, నాభిలో నుండి వచ్చిన మాటలు నిజమైనవని వీటినే మోక్షమని మన పూర్వీకులు భావించారు. నాభిలో నుండి వచ్చే మాటకు అంతశక్తి, విలువ ఉంటుంది. మంత్రం గానీ ఇతర చదువులుగాని చదివేటప్పుడు నాభి నుండే స్వరం రావాలి లేకపోతే ఆ విద్య సిద్ధించదు.
- ఏ సింహద్వారంగల ఇంటికైనా ఇదే విధంగా ‘స్థిరవాస్తు పురుషుని’ అనుసరించి నాభి స్థానం గుర్తించవలెను. ఈ నాభి స్థానమునందే శంకుస్థాపన చేయవలెను.
- శంకుస్థాపన వాస్తు పురుషుని నాభిస్థానములో చేస్తే ఆ ఇంట్లో భోగ భాగ్యములు కలుగుతాయని స్పష్టంగా చెప్పబడినది.
పుత్రస్యనాశ శ్శిరసిప్రభూతే స్త్రీణాం క్షయ: పాదతల ప్రభూతే!
ఘాతే తు పృష్టేభయరోగాపీడా స్త్రీపుత్ర లాభం చ ధనం చ కుక్షౌ !!
తాత్పర్యం: వాస్తు పురుషుని శిరస్సు భాగంలో శంకువు స్థాపన చేసినచో ఫలితం పుత్రనాశనం జరుగుతుంది. పాదముల వైపు స్థాపన చేస్తే స్త్రీ జననష్టము జరుగుతుంది. వీపువైపు శంకువు స్థాపితం చేస్తే భయము, రోగము, పీడలను కలుగజేస్తుంది. శంకువును బొడ్డు ‘నాభి’ భాగంలో స్థాపిస్తే స్త్రీలు, పుత్రులు, ధనము మొదలగు సకల సౌఖ్యములను కలిగింపజేస్తుంది అని భావం. ఈశాన్యంలో శంకువే కాదు కదా గుమ్మం ఏర్పాటు చేసుకున్నా కూడా శాస్త్ర విరోదమే.
మనిషికి శరీరంలో ఏ భాగంలోనైనా ప్రమాదం వస్తే తట్టుకోవచ్చుగాని, నాభి ‘కడుపు’లో వస్తే తట్టుకోలేరు. చివరికి అది ఆకలి సైతం. అందుకే ఎలాంటి పొరపాట్లు లేకుండా శంకువును గృహ నిర్మాణ సమయంలో నాభి స్థానంలో మాత్రమే చేయాలని శాస్త్రం నిక్కచ్చిగా సూచించింది.