Top Ad unit 728 × 90

వీటిని అదుపు చేయకపోతే మానవ జన్మ అంతులేని కష్టాల పాలవుతుంది...!

వీటిని అదుపు చేయకపోతే మానవ జన్మ అంతులేని కష్టాల పాలవుతుంది...!

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

అనేక జన్మ వ్రత పుణ్యానాం మానవ జన్మ ప్రణష్యతి. భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో నిర్ణయం మనదే. సృష్టిలో మానవ జన్మ ఎంతో క్లిష్టమైనది. మనిషి పుట్టడంతోనే తనలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే మనిషి మనుగడ సాగించలేడు.

 

ఆ పదకొండులో...

1. అయిదు జ్ఞానేంద్రియాలు,

2. అయిదు కర్మేంద్రియాలు,

మనసు ఉన్నాయి.

 

1. శ్రోత్రం (చెవి),

2. త్వక్‌ (చర్మం),

3. చక్షుషీ (కన్నులు),

4. జిహ్వా (నాలుక),

5. నాసికా (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలైతే,

 

1. పాయు (మలద్వారం),

2. ఉపస్థ (మూత్రద్వారం),

3. హస్త (చేతులు),

4. పాద (కాళ్లు),

5. వాక్‌ (మాట) అనేవి కర్మేంద్రియాలు. ఈ పదింటికి చివర మనసు. ఇదీ ఇంద్రియ సమూహం. ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య. ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.

 

* మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.

* చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.

* కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.

*  నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.

* ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.

* మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.

* కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.

* మాట అదుపు తప్పుతుంది... ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,

 

* మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు. అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే. మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.

 

అందుకే వాల్మీకి అంటాడు 'ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం' అని రామాయణ మహాకావ్యంలో అంటాడు. చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం. ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే. అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు.

 

ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు. కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం. లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి. ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు. ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి. పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.

 

ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది. మెదడును చక్కగా ఉంచుకోవడానికి 'ఆయుర్వేదం' ఇలా మార్గోపదేశం చేస్తోంది. పరిశుద్ధమైన శాఖాహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది.

 

ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే.

వీటిని అదుపు చేయకపోతే మానవ జన్మ అంతులేని కష్టాల పాలవుతుంది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *