Top Ad unit 728 × 90

వ్రతాల మాసం-శ్రావణమాసం

వ్రతాల మాసం-శ్రావణమాసం

డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ

 

పంచ ప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ

చిన్మయీ పరమానందా విజ్ఞాన ఘనరూపిణీ

 

ఇచ్ఛాశక్తి  జ్ఞానశక్తి  క్రియాశక్తి  స్వరూపిణీ

సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ

 

జ్యోతిష ప్రకారంగా పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని, స్వామివారి హృదయేశ్వరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. ఈ శ్రావణమాసములో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.

 

శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం జూలై, ఆగష్టు నెలల్లో వస్తుంది. వర్షఋతువు కారణంగా విస్తారమైన వర్షాలు పడతాయి. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా మన పెద్దలు చెబుతారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం, ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ప్రారంభమవుతాయి.

 

శ్రావణమాసంలో వచ్చే పండుగలు:

శ్రావణ శుద్ధ విదియ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.

శ్రావణ శుద్ధ తదియ. 

శ్రావణ శుద్ధ 'చతుర్థి' నాగుల చవితి, దుర్వాగణపతి వ్రతం.

శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి, మంగళ గౌరీ వ్రతారంభం.

శ్రావణ శుద్ధ సప్తమి

శ్రావణ శుద్ధ అష్ఠమి "4 ఆగష్టు 2022 శుక్రవారం" శ్రీ వరలక్ష్మి వ్రతం.   

 శ్రావణ శుద్ధ నవమి కౌమారీ దేవిపూజ. 

శ్రావణ శుద్ధ దశమి ఆశాదశమి. దది వ్రతారంభం.

శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రదా (సర్వేషాం) ఏకాదశి

శ్రావణ శుద్ధ ద్వాదశి మంగళ గౌరీ వ్రతం, దామోదర ద్వాదశి.

శ్రావణ శుద్ధ త్రయోదశి. 

శ్రావణ శుద్ధ చతుర్దశి ఋగ్వేద, యజుర్వేద ఉపాకర్మ.

 శ్రావణ పూర్ణిమ రాఖీ (జంధ్యాల) పూర్ణిమ, హయగ్రీవ జయంతి. 

 శ్రావణ బహుళ పాడ్యమి. 

శ్రావణ బహుళ విదియ శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన.

శ్రావణ బహుళ తదియ

శ్రావణ బహుళ చవితి "సంకష్టహర చతుర్ధి" స్వాతంత్ర్య దినోత్సవం.

శ్రావణ బహుళ పంచమి మంగళ గౌరీ వ్రతం.

శ్రావణ బహుళ షష్ఠి సింహాసంక్రాంతి. 

శ్రావణ బహుళ సప్తమి

శ్రావణ బహుళ అష్ఠమి (స్మార్త, మాద్వ) కృష్ణాష్టమి.

శ్రావణ బహుళ నవమి "రోహిణి నక్షత్రం" గోకులాష్టమి (వైష్ణవ)

శ్రావణ బహుళ దశమి. 

శ్రావణ బహుళ ఏకాదశి అజ 'మతత్రయ' ఏకాదశి. 

శ్రావణ బహుళ ద్వాదశి. 

శ్రావణ బహుళ త్రయోదశి. 

శ్రావణ బహుళ చతుర్దశి మాసశివరాత్రి. 

శ్రావణ బహుళ అమావాస్య 'పొలాల అమావాస్య'

 

శ్రావణమాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని చేకూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

 

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు. మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు.

 

"గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.

 

వ్రతాల మాసం-శ్రావణమాసం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *