మగ కోడిపిల్లలను ఆడకోడి పిల్లలుగా మార్పు...!
మగ కోడిపిల్లలను ఆడకోడి పిల్లలుగా మార్పు...!
PSLV TV: ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. అయితే, ప్రజల అవసరాన్ని తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న కోళ్లు సరిపోవట్లేదు. అందుకే కృత్రిమ పద్ధతుల్లో కోళ్లను పెంచుతున్నారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు వాటికి మందులు ఇచ్చి త్వరగా గుడ్లు పొదిగేలా చేస్తున్నారు. దీనివల్ల కోళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. సాధారణంగా కోళ్లను పెంచే ఇంక్యుబేటర్లలో ఆడ, మగ కోళ్లు సమానంగా పెరుగుతాయి. వీటిలో ఆడ కోళ్లు మాత్రమే గుడ్లు పెట్టగలవు. అందుకే వాపారులకు ఆడ కోళ్ల అవసరమే ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏటా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మగ కోడిపిల్లల్ని చంపేస్తున్నారని అంచనా. దీనికి చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్‌కి చెందిన సూస్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ చేపట్టిన ప్రయోగం ఫలితాలనిచ్చింది. 2017లో స్థాపించిన ఈ సంస్థ సాధించిన విజయానికి రూ.24 కోట్లను బహుమతిగా అందుకుంది. మగ కోడి పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు సమర్థంగా లింగాన్ని మార్చడం ద్వారా వాటిని ఆడ కోడిగా మార్చి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. మగ కోళ్లు పెరిగే హేచరీల్లో ధ్వని ప్రకంపనలు చేయడం వల్ల వాటిలోని జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది. తద్వారా మగ కోళ్లలో సహజంగా ఏర్పడే వృషణాలకు బదులు, అండాశయం ఏర్పడుతుంది. అవి ఆడకోడి పిల్లలుగా మారి గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా, వ్యాపారులకు ఖర్చు తగ్గడమే కాకుండా, కోట్ల కొద్దీ మగకోళ్లను కాపాడుకోవచ్చు.
ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వనప్పటికీ, మగ కోడి పిల్లలను 60 శాతం ఆడపిల్లలుగా మార్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. గుడ్లు పొదిగే మొదటి 13 రోజులలో కోళ్లకు ధ్వని తరంగాలను ప్రసారం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది. ఫ్రీక్వెన్సీ, వాల్యూమ్, ఉష్ణోగ్రత, తేమ వంటి ఇతర కారకాలకు కోళ్లను గురిచేసి మగకోళ్లను, ఆడకోళ్లుగా మార్చనున్నట్లు సూస్ టెక్నాలజీస్ సీఈవో అల్టర్ వివరించాడు. ఈ పద్ధతి కోసం ప్రభుత్వాల నుంచి పేటెంట్ హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
స్టార్టప్ సంస్థ సూస్ టెక్నాలజీస్ CEO యాయెల్ ఆల్టర్ మాట్లాడుతూ, "మగ కోడిపిల్లల సంఖ్య తగ్గించడానికి మేము కోడి లింగాన్ని మారుస్తున్నాము. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని వాణిజ్య గుడ్డు ఫామ్‌లో మా సాంకేతిక పరిజ్ఞానంపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఈ ట్రయల్ విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమకు ఖర్చు తగ్గడమే కాక, ప్రజల అవసరాన్ని తీర్చగలిగే అవకాశం లభిస్తుంది. ఇటాలియన్, యుఎస్ గుడ్డు ఉత్పత్తిదారులతో కలిసి ఈ పైలెట్ ప్రాజెక్టును చేపట్టాం.'' అని అన్నారు. సూస్ టెక్నాలజీస్‌తో పాటు మగ కోళ్ల సమస్యను పరిష్కరించడానికి ఇతర స్టార్టప్‌లు కూడా పనిచేస్తున్నాయి. కానీ అవి పొదిగే ముందు గుడ్డు లింగాన్ని గుర్తించడంపై దృష్టి సారించాయి.
