Top Ad unit 728 × 90

భార్యతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనొచ్చా…?

భార్యతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనొచ్చా…?

 

భార్యతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనొచ్చా…? ఈ అంశంపై డిల్లీ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెల్లడించింది. మారిటల్ రేప్‌కు సంబంధించిన ఐపీసీలోని సెక్షన్ 375(2) రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ధర్మాసనంలో ఓ న్యాయమూర్తి పేర్కొనగా, మరో న్యాయమూర్తి ఆయనతో విభేదించారు.

 

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య సంబంధం. మరోవైపు రేప్ అనేది అంగీకారం లేకుండానే సెక్స్‌లో పాల్గొనడం. ఎంతో అందమైన ప్రేమ, పెళ్లి కొన్నిసార్లు మానసిక ఆవేదన, శారీరక హింస, ఆర్థికపరమైన వేధింపులకు కారణం అవుతుంటాయి. దీంతో గృహ హింస కేసులూ పెరుగుతుంటాయి.

 

కొన్నిసార్లు భార్య అనుమతి లేకుండానే భర్తలు బలవంతంగా సెక్స్‌లో పాల్గొంటుంటారు. దీన్నే మారిటల్ రేప్‌ లేదా వైవాహిక అత్యాచారంగా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాల్లో మారిటల్ రేప్‌ను నేరంగానే పరిగణిస్తున్నారు. ఈ నేరానికి కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నారు.

 

డిల్లీలో 2012లో జ్యోతి పాండేపై సామూహిక అత్యాచారం అనంతరం, మహిళలపై నేరాలు, హింసను అరికట్టేందుకు జస్టిస్ వర్మ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటుచేసింది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని ఈ కమిటీ సూచించింది. అయితే, ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు తాజాగా డిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సమయంలోనూ ప్రభుత్వం తన వైఖరిలో స్పష్టత ఇవ్వలేదు. కానీ, విచారణ సమయంలో చాలా చర్చ జరిగింది.

మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తే చాలా పెళ్లిళ్లు పెటాకులు అవుతాయని, తమ అత్తింటి వారిని వేధించేందుకు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశముందని, గృహహింసను అరికట్టేందుకు ఇప్పటికే ఒక చట్టం ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చెప్పారు.

 

ఈ విషయాన్ని లోతుగా అవగాహన చేసుకునేందుకు భిన్న దేశాల్లో విధానాలను నేను పరిశీలించాను. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే దేశాల మహిళలతో మాట్లాడాను. దక్షిణాసియా దేశమైన నేపాల్‌తోపాటు బ్రిటన్‌లోని చట్టాలను పరిశీలించాను. భారత్‌లో చాలా చట్టాలు బ్రిటన్ నుంచే తీసుకున్నారు.

 

ఈ చట్టం ఎందుకు అవసరం: ఆ అక్టోబరు చలికాలం లీసా లాంగ్‌స్టఫ్‌కు ఇంకా బాగా గుర్తుంది. భార్యతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని దోషిగా లండన్‌లోని ఓ కోర్టు నిర్ధారించింది. రేపిస్ట్ ఎప్పుడైనా రేపిస్టే, అతడికి శిక్ష పడాల్సిందే. బాధితురాలితో ఎలాంటి సంబంధమున్నా సరే, అత్యాచారం అత్యాచారమే అని కోర్టు పేర్కొంది.

 

మేం ఆ రోజు కోర్టు గ్యాలరీలో కూర్చున్నాం. కోర్టు తీర్పు వినగానే మేం ఆనందంతో గెంతులు వేశాం. వెంటనే భద్రతా సిబ్బంది వచ్చి మమ్మల్ని బయటకు పంపించారు. ఆ మరుసటి రోజు అన్ని ప్రధాన పత్రికల్లోనూ ఈ తీర్పు పతాక శీర్షికల్లో వచ్చింది అని లీసా చెప్పారు.

 

ఈ తీర్పు కోసం లీసా, ఆమె పనిచేస్తున్న విమెన్ ఎగైనెస్ట్ రేప్ (WAR) సంస్థ 15ఏళ్లు పోరాడింది. 1970ల్లో ఈ పోరాటం మొదలైంది. మహిళలపై హింస, వారికి ఉపాధి హక్కులు, ఆర్థిక స్వేచ్ఛ తదితర హక్కుల కోసం బ్రిటన్‌లో చాలామంది మాట్లాడటం మొదలుపెట్టారు. దీనిపై భారీగా చర్చలు జరిగేవి. మహిళపై ఒక పరాయి పురుషుడి హింస గురించి మాట్లాడేటప్పుడు, భర్తచేసే హింస గురించి ఎందుకు మాట్లాడకూడదు? అన్ని రకాలుగా ఆధారపడే భర్తే హింసకు పాల్పడితే ఎలా అని లీసా ప్రశ్నించారు.

 

క్రమంగా ఇలా ఆలోచించే వారి సంఖ్య పెరిగింది. 1985లో WAR ఏర్పడింది. లండన్‌లో 2,000 మంది మహిళలపై సర్వే చేపట్టింది. దీనిలో ప్రతి ఏడుగురిలో ఒకరు మారిటల్ రేప్‌కు బాధితులని తేలింది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఈ సంస్థ కృషి చేసింది. క్రిమినల్ లా రివిజన్ కమిటీకి సంస్థ అభ్యర్థనలు కూడా పంపించింది. మీడియాలో ప్రచారాలు కూడా చేపట్టింది.

 

మరోవైపు నేపాల్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలే ఫోరమ్ ఫర్ విమెన్ ఇన్ లా అండ్ డెవలప్‌మెంట్ (ఎఫ్‌డబ్ల్యూఎల్‌డీ) చేపట్టింది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని దేశ సుప్రీం కోర్టులో ఎఫ్‌డబ్ల్యూఎల్‌డీ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది.

 

మన సంప్రదాయాల్లో మహిళలు అన్నీ వదిలేసి భర్త కుటుంబంలో అడుగుపెడతారు. ఇది పురుషాధిక్య ప్రపంచం. ఇక్కడ మహిళలను ఒక వస్తువుగా చూస్తారు. పెళ్లి అయిన తర్వాత, భర్త ఏం చేసినా చెల్లుతుందని అందరూ భావిస్తుంటారు. కానీ, అలాంటి హింసను అడ్డుకోవడానికి ఇలాంటి చట్టాలు తప్పనిసరి అని ఎఫ్‌డబ్ల్యూఎల్‌డీకి చెందిన మీరా ధుంగన చెప్పారు. ఈ అంశంపై నేపాల్ సుప్రీం కోర్టు 2001లో తీర్పునిచ్చింది. దీనిపై పార్లమెంటు చట్టం చేయడానికి మరొక ఐదేళ్లు పట్టింది. మొత్తానికి 2006లో నేపాల్ ప్రభుత్వం మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, కేవలం మూడు నుంచి ఆరు నెలల జైలు శిక్షను మాత్రమే దోషులకు విధించాలని దీనిలో పేర్కొన్నారు. మళ్లీ దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి గరిష్ఠంగా విధించాల్సిన శిక్షను ఐదేళ్లకు పెంచుతూ 2017లో పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

 

చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారా: మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలనే అంశంపై చర్చ మొదలైనప్పుడు ఇది పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణం అవుతుందని, ఈ చట్టాలను దుర్వినియోగం చేసే ముప్పుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ చట్టం దుర్వినియోగం అవుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని కొందరు న్యాయవాదులు అంటున్నారు. ఒక చట్టం వల్ల పెళ్లిళ్ల వ్యవస్థ దెబ్బ తినడంలాంటిది ఉండదని వారు చెబుతున్నారు.

 

ఈ విషయంపై నేపాల్‌లోని లీగల్ ఎయిడ్ అండ్ కన్సల్టెన్సీ సెంటర్ (ఎల్‌ఏసీసీ)కు చెందిన పుణ్యశీల దవాడికి 21ఏళ్ల అనుభవముంది. మహిళలు అంత త్వరగా కుటుంబం నుంచి విడిపోవడానికి ప్రయత్నించరు. వేధింపులు భరించలేని స్థాయికి వెళ్లేవరకు వారు ఓర్పుతోనే ఉంటారు అని ఆమె అన్నారు.

 

కొందరు మహిళలు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఈ విషయం గురించి మాట్లాడితే వారి కుటుంబానికి తలవంపులు వస్తాయని వారు భావిస్తుంటారు. కొందరు భర్తలైతే రాత్రంతా తమను నగ్నంగా పడుకోవాలని వేధిస్తుంటారని వారు చెబుతుంటారు. మరికొందరైతే బలవంతంగా ఫోన్లలో అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేస్తారని వివరిస్తుంటారు. ఇంకొందరు పాశవికంగా ప్రవర్తిస్తారని వెల్లడిస్తుంటారు అని పుణ్యశీల చెప్పారు. నేపాల్‌లో ఇప్పటికీ భర్తలు పెట్టే వేధింపులపై మహిళలు బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. 20ఏళ్ల క్రితం కోర్టు ఈ విషయంలో చట్టం చేయాలని సూచించినప్పటికీ, మహిళల్లో ఆ స్థాయిలో చైతన్యం రాలేదు''అని ఆమె అన్నారు.

 

నేపాల్‌లో ఎల్ఏసీసీకి నాలుగు సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా గృహహింస బాధితులు ఎల్ఏసీసీని ఆశ్రయిస్తుంటారు. మరోవైపు ఈశాన్య బ్రిటన్‌లో అవా విమెన్స్ ఎయిడ్ అండ్ రేప్ క్రైసిస్ సెంటర్ (ఏడబ్ల్యూఏఆర్‌సీఎస్)ను నడుపుతున్న రిచిందా టేలర్‌తో మేం మాట్లాడాం. ప్రతి ఏటా దాదాపు వెయ్యి గృహ హింస కేసులు ఏడబ్ల్యూఏఆర్‌సీఎస్‌కు వస్తుంటాయి. వీటిలో సగం మంది కోర్టుల వరకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.

 

ముఖ్యంగా ఉండటానికి ఒక చోటు కోసం వారు మా దగ్గరకు వస్తుంటారు. వారి పిల్లల బాగోగులు, ఉపాధి కోసం మా సాయం కోరుతుంటారు అని టేలర్ వివరించారు. బ్రిటన్‌లో గృహ హింస కేసుల్లో శిక్షలు పడుతున్న కేసుల సంఖ్య తగ్గిపోతోంది. చాలా ఫిర్యాదులు కోర్టుల వరకు చేరడం లేదు. మహిళలు తమకు తాము అండగా నిలబడలేకపోతున్నారు అని ఆమె చెప్పారు. గృహహింస విషయంలో ఫేక్ ఫిర్యాదులు చాలా అరుదని లీసా కూడా అభిప్రాయపడ్డారు.

 

మారిటల్‌ రేప్‌పై ఎవరు ఫిర్యాదు చేస్తారు? నేపాల్, బ్రిటన్‌లో మారిటల్ రేప్‌ల గణాంకాలు విడిగా నమోదు చేయడం లేదు. ఇక్కడ, పోలీసులు, న్యాయ వ్యవస్థలో మొత్తం అత్యాచారాల సంఖ్య మాత్రమే అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని మారిటల్ రేప్ కేసులు నమోదయ్యాయి? వాటిలో ఎలాంటి శిక్షలు విధించారు? లాంటి అంశాలను కచ్చితంగా చెప్పడం కష్టం. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళా సాధికారత వల్ల కొంత మంది మారిటల్ రేప్ కేసులు నమోదు చేసేందుకు ముందుకు వస్తున్నారని బ్రిటన్‌లో గృహహింస, అత్యాచారం కేసులను వాదించే ప్రముఖ న్యాయవాది డా. అన్నా ఒలివెరెస్ చెప్పారు.

ఇక్కడ విడాకుల కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హింసతో కూడిన సంబంధాల్లో మహిళలు ఉండేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు పిల్లలను పెంచే బాధ్యత కేవలం మహిళలపైనే ఉండాలనే వాదనకు కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మహిళలు స్వేచ్ఛగా తమకు నచ్చిన భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు అని ఒలివెరెస్ చెప్పారు.

 

మరోవైపు బ్రిటన్‌లో గృహహింస బాధితుల కోసం సంరక్షణ కేంద్రాలను కూడా పెద్దయెత్తున ఏర్పాటుచేస్తున్నారు. భర్త నుంచి విడిపోవాలని అనుకునేవారు హాయిగా ఇక్కడకు వచ్చి ఉంటున్నారు అని ఆమె వివరించారు.

 

అయితే, ధనిక వర్గాలకు చెందిన మహిళలే ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదు చేస్తుంటారని, పేదలు హింసను భరిస్తారని లీసా అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎక్కువ సంపాదించే మహిళలు, లేదా బాగా చదువుకున్న వారు మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసులు నమోదుచేస్తారు అని ఆమె అన్నారు.

 

నేపాల్‌లోనూ ధనిక వర్గాలే మారిటల్ రేప్ కేసులను ఎక్కువగా నమోదు చేస్తుంటారని ఎఫ్‌డబ్ల్యూఎల్‌డీకి చెందిన సుష్మా గౌతమ్ చెప్పారు. అయితే, బ్రిటన్‌తో పోల్చినప్పుడు బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించే సంరక్షణ కేంద్రాలు నేపాల్‌లో చాలా తక్కువ. మరోవైపు మహిళలపై సమాజం నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది.

 

చాలా మంది మహిళలకు చట్టం గురించి తెలుసు. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వారు పోలీసులు, కోర్టుల దగ్గరకు వెళ్లకూడదని అనుకుంటారు అని సుష్మ చెప్పారు. చాలా మంది పిల్లలు పెద్దవారు అయ్యేవరకు హింసను భరిస్తూనే ఉంటారు. మరికొందరు హింస తీవ్రం అయ్యేవరకు ఎదురు చూస్తుంటారు''అని ఆమె అన్నారు.

చట్టాల వల్ల ఉపయోగం ఉందా: భారత్‌లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే చట్టం లేకపోవడంతో మహిళలు కేవలం గృహహింస కింద మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. గృహహింస కింద విధించే శిక్షలు చాలా తక్కువ. పైగా ఈ చట్టం కింద కేసులు నమోదుచేసినప్పటికీ, చాలాసార్లు వారికి వేధింపులు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఈ విషయంలో మారిటల్ రేప్ చట్టాన్ని రూపొందించడం మొదటి అడుగుగా చెప్పుకోవాలి. కానీ, మారిటల్ రేప్‌ను కోర్టులో నిరూపించడం కూడా చాలా కష్టమని నిపుణులు అంటున్నారు.

 

చాలాసార్లు సెక్స్‌కు మహిళలు అంగీకారం తెలపరు. భర్త చంపేస్తాడేమోనని భయపడుతూ అదే బంధాన్ని కొనసాగిస్తుంటారు. తమ మర్మాంగాలు గాయపడుతున్నా వారు సహిస్తుంటారు. ధైర్యంచేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేసరికే ఆమె శరీరంపై గాయాలు మానిపోతుంటాయి. వారి ఆరోపణలకు ఆధారాలు చూపించడమూ కష్టం అవుతుంది అని సుష్మ చెప్పారు.

 

బ్రిటన్‌లో మారిటల్ రేప్ విచారణలో భాగంగా ఆమె మొబైల్‌ ఫోన్‌లోని దృశ్యాలను పరిశీలిస్తుంటారు. వైద్య చరిత్రనూ తెలుసుకుంటారు. చాలా మంది మహిళలు దీనికి అంత సుముఖత వ్యక్తం చేయరు. ఇది వారిపై రెండో అత్యాచారం లాంటిది. మన మర్మాంగాలను వేరొకరు తనిఖీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని లీసా వివరించారు.

 

అయితే, ఆధారాలను సేకరించడానికి చాలా మార్గాలు ఉన్నాయని టేలర్ అన్నారు. ముఖ్యంగా వేధింపులను మనం ఎప్పటికప్పుడు డైరీలో నమోదు చేసుకోవాలి. దీనిపై స్నేహితులతో మాట్లాడాలి. గాయపడిన భాగాల ఫోటోలు తీసుకోవాలి. ఫోన్ సంభాషణలను రికార్డు చేసుకోవాలి అని ఆమె అన్నారు.

 

అసలు మారిటల్ రేప్ అనేది ఒక నేరంగా పరిగణించడమే అన్నింటికంటే పెద్ద విజయమని వీరంతా అంగీకరిస్తున్నారు. పెళ్లి తర్వాత భార్యతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనడం నేరమని బ్రిటన్‌లో పిల్లలకు తెలుసు. దీంతో వారు భవిష్యత్‌లో చాలా అప్రమత్తంగా ఉంటారు అని ఒలివెరెస్ చెప్పారు.

 

అయితే, అభివృద్ధి చెందుతున్న నేపాల్, భారత్ లాంటి దేశాల్లో దీనిపై చాలా చర్చ జరుగుతోంది. మహిళలపై ముఖ్యంగా సామాజిక పరమైన ఒత్తిడి చాలా ఉంటుందని పుణ్యశీల చెబుతున్నారు. మా దగ్గరకు వచ్చే మహిళలకు, భర్తలు బలవంతపెట్టేటప్పుడు మీరు నో చెప్పండని చెబుతాం. ఇది వారి హక్కు అని వారికి తెలియజేస్తాం అని ఆమె చెప్పారు.

2011లో మహిళలకు ఆస్తి హక్కుల కోసం ఎఫ్‌డబ్ల్యూఎల్‌డీ నేపాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తండ్రి ఆస్తిలో పెళ్లి అయిన తర్వాత కూడా కుమార్తెలకు వాటా ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది.

 

ఈ పిటిషన్‌ను దాఖలుచేసిన వారిలో ఒకరైన మీరా మాట్లాడుతూ... బలవంతపు సెక్స్‌కు నో చెప్పడం, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక కట్టుబాట్ల నుంచి విముక్తి లాంటివి అన్నీ కలిసినప్పుడే పురుషాధిక్య సమాజంలో మహిళలు ముందుకు వెళ్లగలరు అని అన్నారు.

భార్యతో బలవంతంగా సెక్స్‌లో పాల్గొనొచ్చా…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *