Top Ad unit 728 × 90

విశ్వకర్మలు ఎవరు...? వీరు ఎంతమంది...?

విశ్వకర్మలు ఎవరు...? వీరు ఎంతమంది...?

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

విశ్వమంగళ మాంగళ్య విశ్వవిద్వా వినోదినే

విశ్వసంసార భీజాయ నమస్తే విశ్వకర్మణే

విశ్వాయ విశ్వరూపాయ నమస్తే విశ్వమూర్తియే

విశ్వమాత పితారూప విశ్వకర్మ నమోస్తుతే.

 

వేదాలలో చెప్పబడిన సర్వ విశ్వ చతుర్దశభువన స్థావరజంగమ జీవనిర్జీవ దేవ మానవాది సకల గణ జన సృష్టికర్త, సకలాధినేత, సర్వజనకుడు, పరమాత్మ అయిన విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుడు. ఈయనే సర్వ జీవులలో ఆత్మరూపంలో కొలువైవుంటాడు. ఆత్మారాముడు అంటే ఈయనే నిరుపమాన తేజో సంపన్నుడగు విరాట్ పురుషుని యొక్క అవతారము. ఈ సృష్టికి పూర్వమే స్వయంభూవుగా వెలసిన రూపమే విశ్వకర్మ రూపం. అసలు విశ్వకర్మలు అంటే ఎవరు. వీరి పూర్వపరాలు ఏమిటి అని గ్రహిస్తే పరమాత్మ విశ్వకర్మ ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధాన దేవతలకు కనిపించును ఇతనికి జయంతి అనునది "పుట్టుక" లేదు.

 

విశ్వకర్మ ఋగ్వేదంలో కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు.

 

సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కాని కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి, ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభారతము ఈయనను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.

 

శ్లో|| నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:

నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః

సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ. (మూల స్తంభ పురాణం)

 

తాత్పర్యం: భూమి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశము, మరియు బ్రహ్మ - విష్ణు - మహేశ్వర - ఇంద్ర - సూర్య నక్షత్రములు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభు రూపమై అవతరించినాడు. ఐదు ముఖాలతో పంచ తత్వాలతో, పంచ రంగులతో, పంచ కృత్యములతో వెలసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణులకు కులగురువైనాడు.

 

ప్రాభాస విశ్వకర్మ అనగా అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడు, బృహస్పతి చెల్లెలు అయిన యోగసిద్ధ లేక భువన అనునామెకు జన్మించిన విశ్వకర్మ.

 

భౌవన విశ్వకర్మ అనగా భువనమహర్షికి పుట్టినవాడు. ఈయనే నీటమునిగివున్న భూమిని బైటకు తీసి నివాసయోగ్యం చేసి నగరాలను పట్టణాలను నిర్మించి వాజపేయ, అశ్వమేధాది వేయి క్రతువులను కశ్యపబ్రహ్మర్షి ఆధ్వర్యంలో నిర్వహించి, సమస్త భూమండలమును ఏక ఛత్రాధిపత్యముగా ఏలిన మొట్టమొదటి సార్వభౌముడు. తదుపరి భూమిని పరిపాలించడం బ్రాహ్మణ లక్షణం కాదని, భూమిని కశ్యప బ్రహ్మర్షికి దానంచేసి తపోవనానికి వెళ్లిపోయిన మహా ధర్మనిష్ఠాగరిష్టుడు, మహా త్యాగి, మహా తపోధనుడు ఐతరేయ బ్రాహ్మణము.

 

1. సూర్యుని మామగారు ఒక విశ్వకర్మ ఈయననే కొన్ని గ్రంథాలలో త్వష్టగా పేర్కొనియున్నారు.

2. మహాభారతంలో ఇంద్రప్రస్థమును నిర్మించిన విశ్వకర్మ ఒకరు.

3. ద్వారకా నగరమును నిర్మించిన విశ్వకర్మ ఒకరు.

4. లంకా నగరమును నిర్మించిన విశ్వకర్మ ఒకరు.

5. త్రిపురములను నిర్మించిన మయవిశ్వకర్మ ఒకరు.

6. దుర్యోధనునికి లాక్షా గృహమును నిర్మించి ఇచ్చిన పురోచన విశ్వకర్మ ఒకరు.

7. త్రిపురములను ధ్వంసం చేయుటకు వీరభద్రునికి రథం నిర్మించి ఇచ్చిన విశ్వకర్మ ఒకరు.

8. బృందావన నగరమును నిర్మించిన విశ్వకర్మ ఒకరు.

9. యజుర్వేదంలో ఋషిగా దర్శనమిచ్చే విశ్వకర్మ ఒకరు.

10. లోకంలోని ఉత్తమ పదార్థములతో తిలోత్తమ అను అప్సరసను సృష్టించిన విశ్వకర్మ ఒకరు.

 

ఇలా ఇంకెందరో ప్రాచీన చరిత్రలో, సాహిత్యంలో ఎంతమంది విశ్వకర్మలున్నారో చెప్పడం కష్టమే. మన ప్రాభవాన్ని ప్రజ్ఞా పాటవముల వైశిష్ట్యాన్ని ఓర్వలేని ఈర్ష్యాళువుల చేతులలో పడి కనుమరుగైపోయిన విశ్వ కర్మలు ఎంతమంది చరిత్ర రహితులైనారో చెప్పుట కష్టము. కొందరి కపట నాటక విద్వేషపూర్వక దుర్మార్గకంగా సాహిత్యంలో చరిత్ర హీనులుగా మార్చబడ్డ విశ్వకర్మలు ఎందరో. ఏది ఏమైనా మనవారి చరిత్రలు ప్రపంచానికి లేకుండా చేసినప్పటికీ పరాత్పర విశ్వకర్మయే గాక ఆయనపైగల అచంచల భక్తి విశ్వాసములతో ఆయన పేరును పెట్టుకున్న విశ్వకర్మలు చాలామంది ఉన్నట్లు అర్థమవుతుంది.

 

వారు వారి అసమాన శిల్పచాతుర్యంతో ప్రపంచమునకు ప్రయోజనకర కార్యక్రమములు నిర్వహించి కులమత ప్రాంత వర్గ వర్ణ లింగ భాషాది భేదములు చూపక ప్రజా సంక్షేమమునకు పాటుపడి పంచ శిల్పములతో ప్రపంచమును ఈ స్థాయికి తీసుకువచ్చినారు. వీరు లేక ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అనునది నూటికి నూరుపాళ్లు నిజం నిజం నిజం. అందుకే విశ్వకర్మలేక విశ్వంబులేదురా అన్నాడు వేమనయోగి.

 

నిష్టాగరిష్టులైన ఈ విశ్వ బ్రాహ్మణులు కుల వృత్తులనే కాక జ్యోతిష, పౌరోహిత, విద్యావేత్తలుగా, ప్రాచీన సంప్రదాయ వైద్యులుగా, యంత్ర, గృహవాస్తు నిర్మాతలుగా, ఆర్కిటేక్చర్లుగా, సివిల్ ఇంజనీయర్లుగా, రాజకీయ, సినిమా, టివి మొదలగు అనేక రంగాలలో నాటి నుండి నేటి వరకు సకల కళల యందు వీరి ప్రావీణ్యతను నిరూపిస్తూ, ఈ విశ్వంనందు నిష్ణాతులై విరాజిల్లుతున్నారు. సర్వం శ్రీమద్విరాడ్విశ్వకర్మ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు, ఓం నమో విశ్వకర్మణే.

విశ్వకర్మలు ఎవరు...? వీరు ఎంతమంది...? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *