Top Ad unit 728 × 90

యుద్ధం ముగిసేదాకా జెలెన్‌స్కీనే!

యుద్ధం ముగిసేదాకా జెలెన్‌స్కీనే!

 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా మూడ్రోజుల క్రితమే పదవీకాలం పూర్తి... అయినా కొనసాగింపు

మార్చిలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నిక వాయిదా

మార్షల్‌ లా ముగిసేదాకా ఎన్నికల్లేనట్లే

 

రష్యాతో యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ కొనసాగే సూచనలు కొనసాగుతున్నాయి. టీవీ సీరియల్‌ కమేడియన్‌గా ఉక్రెయిన్‌ ప్రజలకు సుపరిచితుడైన జెలెన్‌స్కీ... 2019 మే 20న అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆయన ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 20తోనే ముగిసింది. ఉక్రెయిన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి పదవీకాలం ముగియడానికి 45 రోజుల ముందే ఎన్నికలు జరగాలి. అంటే... ఈ ఏడాది మార్చి 31న ఎన్నికలు జరగాల్సింది. కానీ, 2022 ఫిబ్రవరి 24 ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటికీ భీకరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. దీంతో... తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని జెలెన్‌స్కీ సోమవారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ''సైనికులు యుద్ధంలో ఉన్నారు. విదేశాల్లో 70 లక్షల మంది దాకా ఉక్రెనియన్లు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ఎన్నికలను వాయిదా వేస్తున్నాం'' అని వివరించారు. ఉక్రెయిన్‌ రాజ్యాంగం ప్రకారం సైనిక చట్టం(మార్షల్‌ లా) అమలులో ఉన్నప్పుడు ఎన్నికలు జరగడానికి వీలు లేదు. రష్యాతో యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా కొనసాగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా... ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 540 కోట్ల ఉక్రెయిన్‌ కరెన్సీ(రూ.1,129 కోట్లు) అవసరం అవుతుందని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ అంచనా వేసింది. ''దేశంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ప్రశాంతంగా లేవు. కొన్ని ప్రాంతాల్లోనే ఎన్నికలు నిర్వహించడం సబబు కాదు. పైగా, బాంబింగ్‌, షెల్లింగ్‌ మధ్య పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదు'' అని తేల్చిచెప్పింది. అయితే... ఇలాంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు... ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే... అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టాలనేదానిపై రాజ్యాంగం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దీంతో... తానే అధ్యక్షుడిగా కొనసాగడం సరైందేనని జెలెన్‌స్కీ చెబుతున్నారు. పైగా విపక్ష పార్టీల నేతలు కూడా ఇందుకు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసినట్లు వివరించారు. ఈ నెల 14న కీవ్‌ నగరంలో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కూడా యుద్ధం సద్దుమణిగేదాకా ఎన్నికలను నిర్వహించకపోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

జెలెన్‌స్కీకే ప్రజల మద్దతు

గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన ఓ సర్వేలో... ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, 80శాతానికి పైగా పౌరులు జెలెన్‌స్కీకే జైకొట్టినట్లు తేలింది. అప్పట్లో జెలెన్‌స్కీకి జైకొట్టినవారంతా యుద్ధం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంటర్‌ ఫర్‌ అనాలసిస్‌ అండ్‌ సోషలాజికల్‌ రిసెర్చ్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో మాత్రం 67% మంది మాత్రమే జెలెన్‌స్కీకి జైకొట్టారు. అంటే... క్రమంగా జెలెన్‌స్కీ ప్రభ మసకబారుతోందని స్పష్టమవుతోంది.

 

నాటో ఆదుకోవాలి... యుద్ధాన్ని ఆపాలి: జెలెన్‌స్కీ

రష్యా యుద్ధాన్ని ఆపేందుకు నాటో తమను ఆదుకోవాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఆయుధాలను సరఫరా చేయాలని ఇటలీ మీడియా సంస్థ రాయ్‌-1కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కోరారు. తమ దేశంపై జరుగుతున్న క్షిపణిదాడులను అడ్డుకునేందుకు నాటో దేశాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాల్లో త్వరలో ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని ఖరారు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నాటో చొరవతోనే ఈ యుద్ధానికి ముగింపు ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- సెంట్రల్‌ డెస్క్‌

 

యుద్ధం ముగిసేదాకా జెలెన్‌స్కీనే! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *