కొవిడ్ నుంచి కోలుకుని వైట్‌హౌస్ చేరుకున్న బైడెన్
కొవిడ్ నుంచి కోలుకుని వైట్‌హౌస్ చేరుకున్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ నెగెటివ్ రావడంతో మంగళవారం రోజున ఆయన వైట్ హౌస్కు చేరుకున్నారు. బైడెన్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ తెలిపారు.
బైనాక్స్ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌గా వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కూడా లేవని వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని చెప్పారు.
ఇక శ్వేతసౌధం చేరుకున్న సందర్భంగా ఎలా ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బైడెన్... 'ఆల్ ఈజ్ వెల్' అని బదులిచ్చారు. అధ్యక్ష రేసు నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ను ఓడించే సామర్థ్యం హారిస్‌కు ఉందా? అని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.
గత బుధవారం కొవిడ్ సోకినట్లు తేలిన తర్వాత బైడెన్ డెలావెర్‌లోని ఆయన నివాసంలో ఐసోలేషన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. క్వారంటైన్‌లో ఉండగానే బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతే కాకుండా.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తన మద్దతు ప్రకటించారు.