మీ ఇష్టం, ఏ పార్టీలో అయినా చేరండి: రజనీ మక్కల్ మంద్రమ్
మీ ఇష్టం, ఏ పార్టీలో అయినా చేరండి: రజనీ మక్కల్ మంద్రమ్
తాను రాజకీయాల్లోకి రావడం లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పిన కొన్ని రోజులకే ఆయన అభిమానులు ఇతర రాజకీయ పార్టీలను చూసుకుంటున్నారు. ఈ మధ్యే కొందరు జిల్లాల నేతలు డీఎంకేలో చేరారు. ఈ నేపథ్యంలో రజనీ మక్కల్ మంద్రమ్ టీమ్ సభ్యులు స్పందించారు. ఇక ఎవరైనా టీమ్‌కు రాజీనామా చేసి, వేరే ఏ పార్టీలో అయినా చేరవచ్చు అని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే వాళ్లు ఏ పార్టీలో చేరినా రజనీకాంత్ అభిమానులం అన్న విషయాన్ని మాత్రం మరచిపోవద్దని ఆ ప్రకటనలో చెప్పారు.
రజనీ రాజకీయాల్లోకి రాకపోయినా, తమిళనాడులో తమకు మద్దతు ఇస్తారని బీజేపీ ఆశతో ఉంది. ఆయన మద్దతు కోసం కచ్చితంగా ప్రయత్నిస్తామని ఆ పార్టీ తమిళనాడు ఇన్ఛార్జ్ సీటీ రవి గతంలోనే చెప్పారు. కానీ తాజాగా ఆయన టీమ్ చేసిన ప్రకటన బీజేపీకి మింగుడు పడటం లేదు. ప్రస్తుతం తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకేతో బీజేపీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. కానీ రజనీ టీమ్‌కు చెందిన నేతలు మాత్రం ప్రతిపక్ష డీఎంకేకి క్యూ కడుతున్నారు. రజనీకి దీనిని అడ్డుకునే ఉద్దేశం లేకపోగా, ఏ పార్టీలో అయినా చేరండన్న ప్రకటనతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లారు.
