ఫ్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు
ఫ్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు... రేవంత్ రెడ్డి
ప్రజా సమస్యలను గాలికొదిలి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చిల్లర రాజకీయాలుచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ...
ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా టీఆర్ఎస్ జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని నిలదీశారు. కార్పొరేట్ కంపెనీల డబ్బులతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ , రైల్వే కోచ్ తదితర వాటిని కాంగ్రెస్ చట్టబద్ధంగా హామీ ఇచ్చిందన్న రేవంత్... ఎనిమిదేళ్లుగా వాటి విషయంలో కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటును చులకన చేసి మాట్లాడిన ప్రధానికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం దేశభద్రతను ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. లోపభూయిష్టంగా ఉన్న అగ్నిపథ్ పథకంపై మోదీని నిలదీయాలని సూచించారు.
