వినియోగదారుల సమాచార గోప్యతపై సిగ్నల్ యాప్ సీవోవో ఏమన్నారో తెలుసా...!
వినియోగదారుల సమాచార గోప్యతపై సిగ్నల్ యాప్ సీవోవో ఏమన్నారో తెలుసా...!
వినియోగదారుల సమాచార గోప్యతకు సిగ్నల్ యాప్ సరైన వేదిక అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) అరుణ హార్డెర్ పేర్కొన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్ల డేటాను సేకరించబోమనీ, అందుకే తమ వద్ద అమ్మకానికి ఏ ఒక్కరి డేటా ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించిన ప్రైవసీ విధానంతో విసుగెత్తిన యూజర్లు పెద్ద సంఖ్యలో సిగ్నల్ యాప్ వైపు మళ్లిన విషయం తెలిసిందే. అనూహ్యంగా లభించిన ఈ ఆదరణ, కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలపై సిగ్నల్ సీవోవో ఇవాళ ఓ ఆంగ్ల మీడియా సంస్థతో ముచ్చటించారు. తాము నంబర్లను బయటికి వెల్లడించబోమనీ, అయితే మునుపటి కంటే ఇప్పుడు వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిన మాట వాస్తవమేనని ఆమె అన్నారు. తమకు ట్రాకర్లు, అనలిటిక్స్ లేనందు వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్ డేటా కంపెనీలు తమ యూజర్ల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయని అరుణ పేర్కొన్నారు. ప్రత్యేకించి భారత యూజర్లే సిగ్నల్ యాప్ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారనీ, దేశం నలుమూలల నుంచి తమకు వస్తున్న ఆదరణ చూసి అమితాశ్చర్యం కలుగుతోందని అన్నారు.
కాగా వినియోగదారుల సమాచార గోప్యతపై అరుణ స్పందస్తూ… ప్రైవసీ అనేది మన హక్కు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను వాడుతున్న వారిలో ఎక్కువ మంది తమ సంభాషణలు వ్యక్తిగతంగానే ఉండాలని కోరుకుంటారు. తమ ఫోటోలు, ఆలోచనలను ఫ్రెండ్స్‌తో మాత్రమే షేర్ చేసుకుంటారు. అంతేగానీ ఫేస్బుక్, గూగుల్, ప్రకటనదారులు లేదా పొటెన్షియల్ ఐడెంటిటీ దొంగలతోనో యూజర్లు వీటిని షేర్ చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ డేటా ఆ కంపెనీల చేతుల్లోకి వెళ్తే యూజర్లను తమకు నచ్చినట్టు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇప్పుడు సందేశాలు, డేటాను ప్రయివేట్‌గా ఉంచడం మొదలుపెడుతున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు మన జీవితాలు ఆన్లైన్ మయం అయిపోతున్నందు వల్ల, డేటా భద్రత, ప్రైవసీ అనేవి అన్నిటి కంటే క్లిష్టంగా మారాయి. ఇది కేవలం కొందరు ప్రజలో, లేక కొన్ని వయసులు, కొన్ని దేశాలకు చెందిన వారికో మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాలకు సంబంధించి ఇప్పుడు ఇదే ఆలోచన పట్టుకుంది. అందరికీ తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంది. అందుకే మేము సిగ్నల్ యాప్‌ను రూపొందించాం. మీరు దేనికోసం చూస్తున్నారో దాన్నే మీకు అందిస్తున్నాం. ప్రైవసీకే మా తొలి ప్రాధాన్యత అని అరుణ వివరించారు.
యూజర్ల డేటా విషయంలో సిగ్నల్ యాప్ ఎలా వ్యవహరిస్తుందనే దానిపైనా అరుణ స్పష్టమైన వివరణ ఇచ్చారు. వినియోగదారుల డేటానుగానీ, మెటా డేటాను గానీ సిగ్నల్ యాప్ సేకరించదు. యూజర్లు పంపే సందేశాలు చదవడం కాదు కదా ఏం మాట్లాడుకున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోం. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎన్ని సందేశాలు పంపారు అనేది మాకు అవసరం లేదు. కనీసం మీ ప్రొఫైల్ ఫోటో ఎలా ఉంటుందో కూడా మేమే చూడం. మీ డేటా మీ వ్యక్తిగతం అని ఆమె అన్నారు. దీన్ని బట్టి మా దగ్గర ఓ ఒక్కరి డేటా ఎవరికీ అమ్మేందుకు అవకాశం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. ఎలాంటి సమాచారం ఉండదు కాబట్టి డేటా కొనేందుకు థర్డ్ పార్టీలేవీ మా దగ్గరకు రావు. మీ సంభాషణలు కేవలం మీకు, మీరు మాట్లాడే వారికి మాత్రమే తెలుస్తాయి అని ఆమె స్పష్టం చేశారు.
