వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10 వరకు హైకోర్టు స్టే
ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. ఇటీవల ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కోరడంతో విచారణను ఎల్లుండి (10వ తేదీ) కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన స్టేను ఎల్లుండి వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తిగా నిలిచిపోయినందున గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏజీ హైకోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ రిజిస్ట్రేషన్లు ఆపివేయాలని తామెప్పుడూ ఆదేశించలేదని.. పాతవిధానంలో కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఆ వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తామనే షరతు విధించి పాతవిధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని సూచించింది. ఈ అంశంలో రాజ్యాంగబద్ధమైన అనేక అనుమానాలున్నందున వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపకముందే తాము అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
