Top Ad unit 728 × 90

సాయంత్రం 5 వరకు లాక్‌డౌన్‌ సడలింపు…?


సాయంత్రం 5 వరకు లాక్‌డౌన్‌ సడలింపు…?

 

ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట అనుమతి
పూర్తిస్థాయిలో పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు
పకడ్బందీగా రాత్రిపూట కర్ఫ్యూ
రేపు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం
ఉచిత రోగ నిర్ధారణ కేంద్రాల ప్రారంభం 9కి వాయిదా

 

లాక్‌డౌన్‌ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు జనసంచారాన్ని అనుమతించాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 9తో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతి వేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచి, ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మరో గంట అనుమతించాలనుకుంటోంది. రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేయనుంది.
 

వివిధ కార్యక్రమాలు, పథకాల అమలు దృష్ట్యా ఆదాయం పెరగాల్సిన అవసరం ఉండడంతో లాక్‌డౌన్‌ సడలింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు ఇస్తే రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ తదితర శాఖల ద్వారా మరింత ఆదాయం సమకూరుతుందనేది ఆలోచన. మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌.. లాక్‌డౌన్‌ వల్ల కరోనా ఎంతమేరకు తగ్గింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ప్రభావితమైందనే అంశాలపై ఆర్థిక, వైద్య ఆరోగ్యం, పోలీసు, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ తదితర శాఖల నుంచి నివేదికలు కోరారు. సీఎం కేసీఆర్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వారికి ఫోన్‌ చేస్తున్నట్లు తెలిసింది.
 

కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆంక్షల అమలుతో పాటు హైరిస్క్‌ ఉన్నవారికి టీకాల కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తోంది. ఐటీ ఉద్యోగులు, ఇతరులకూ వ్యాక్సిన్లు పెద్దసంఖ్యలో వేస్తున్నారు. పరీక్షలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తగ్గింది. ఇంజక్షన్లు లభిస్తున్నాయి. ఔషధాలూ అందుబాటులోకి వచ్చాయి. 19 జిల్లాల్లో ఉచితంగా వైద్యపరీక్షలు చేసేందుకు సర్కారు పూనుకొంది. మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా టీకాల లభ్యత, కేంద్ర విధానాలపై చర్చించనున్నారు. గ్లోబల్‌ టెండర్లకు స్పందన లేకపోవడంతో నేరుగా సంస్థలతో చర్చించి, చౌకధరలకు కొనుగోళ్లు జరపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనుంది. నీటిపారుదల శాఖలో అదనపు ఆయకట్టు కోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, వాటి పురోగతి, మరమ్మతులు, నిర్వహణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలూ మంత్రి మండలి సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ, వానాకాలం సీజన్‌కు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరా, ఆయకట్టు పెరుగుదల, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించనుంది. రాష్ట్రంలో కల్తీ విత్తనాల నిరోధం కోసం క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత విధానం, బయో ఫెర్టిలైజర్స్‌నూ చట్టపరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత విత్తన విధానం, బయో ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌లకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు కొత్త ఉద్యోగ నియామకాలు, ఇతర విధాన నిర్ణయాలు తీసుకోనుంది.
 

రాష్ట్రంలో 19 జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను సోమవారం నుంచి ప్రారంభించాల్సి ఉండగా... దాన్ని ఈ నెల 9కి ముఖ్యమంత్రి వాయిదా వేశారు. మొత్తం 19 కేంద్రాలను ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. సీఎం సైతం ఒక కేంద్రాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. మంత్రులందరితో పాటు వారు లేనిచోట ఇతర ప్రముఖుల చేతులమీదుగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపై మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *