ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఆర్.రోహిణి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 5 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జనవరి 6వ తేదీ నుంచి 15 వరకు అపరాధ రుసుం చెలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలు గల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి ప్రవేశాలు పొందాలని తెలిపారు. మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. వెబ్ సైట్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా మీసేవా, టీఎస్, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఆన్లైన్లోనే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మిగతా వివరాలకు తెలంగాణఓపెన్‌స్కూల్.ఓఆర్జీ వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు.
