Top Ad unit 728 × 90

కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌


కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌

 

కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ను కేంద్రమంత్రి పదవి వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

 

జిల్లా నుంచి కేంద్రమంత్రిగా అరుదైన అవకాశం పొందిన వారిలో బండి మూడవ వ్యక్తిగా నిలిచారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెన్నమనేని విద్యాసాగర్‌రావు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు. ఇప్పుడు బండి సంజయ్‌కుమార్‌ కేంద్రమంత్రి వర్గంలో సహాయమంత్రి హోదాలో ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కుమార్‌ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎంపీల మెజార్టీ రికార్డును బ్రేక్‌ చేసి 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన అందించిన సేవలను పార్టీ పట్ల ఉన్న వినయవిధేయత, అంకితభావాన్ని పరిగణలోకి తీసుకొని జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టినట్లు భావిస్తున్నారు. 54 ఏళ్ల వయస్సున్న బండి సంజయ్‌కుమార్‌ బాల్యం నుంచే స్వయం సేవకునిగా, రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌లో పనిచేస్తూ విద్యార్థి దశలో ఏబీవీపీలో చేరారు. ఆ సంస్థ పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా ఎదిగారు. తర్వాత బీజేపీ యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా, ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా సేవలందించి కేరళ, తమిళనాడు రాష్ట్రాల యువజన విభాగాల ఇంచార్జిగా బాధ్యతలను నిర్వహించారు. ఎల్‌కె అద్వానీ చేపట్టిన రథయాత్రలో వాహన ఇంచార్జిగా పనిచేశారు. బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీ ఎన్నికల కార్యాలయంలో ఇంచార్జిగా కూడా పార్టీకి సేవలందించారు. 1994లో కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా రాజకీయాల్లో ప్రవేశించారు. అదే పదవిలో ఆయన పదేళ్లపాటు కొనసాగారు. 2005 నుంచి 2014 వరకు వరుసగా ఆయన రెండుసార్లు కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేటర్‌గా సేవలందించారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి 52వేల ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. 2019లో తిరిగి ఇదే స్థానం నుంచి పోటీచేసి 66వేల ఓట్లను పొంది తిరిగి రెండోస్థానానికే పరిమితమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేసిన ఆయనకు సానుకూల ఫలితం లభించలేదు. అయితే పార్లమెంట్‌ ఎన్నికలు మాత్రం ఆయనకు సంపూర్ణంగా కలిసివచ్చాయి. రెండుసార్లు ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కేలా చూశాయి. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి 89వేలపై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి రెండో విజయాన్ని పొందడంతోపాటు తన మెజార్టీని 2,25,209కి పెంచుకున్నారు. 2019లో పార్లమెంట్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సభ్యుడిగా నియమితులై ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. అలాగే టుబాకో బోర్డు మెంబర్‌గా, మైనార్టీ అఫైర్స్‌ స్టేట్‌ లెవల్‌ కమిటీ సభ్యుడిగా, ఏయిమ్స్‌ బీబీనగర్‌ బోర్డు సభ్యుడిగా సేవలందించారు. 2020 మార్చి 11న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై ఆ పదవిలో 2023 జూలై 3వరకు కొనసాగారు. ఈ సందర్భంలోనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామయాత్ర నిర్వహించి పార్టీ పటిష్టానికి కృషిచేశారు. హైదరాబాద్‌ జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కేందుకు కారకులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో బీజేపీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకవెళ్లడానికి బండి సంజయ్‌ చేసిన కృషి రాష్ట్ర రాజకీయవర్గాలను, ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఆకర్షించడమే కాకుండా పార్టీలో బలమైన శక్తిగా సంజయ్‌ని నిలిపింది. రాష్ట్రంలో రైతుల ఉద్యమాలు, నిరుద్యోగ మార్చ్‌, పదవ తరగతి పేపర్ల లీక్‌ తదితర అంశాలపై ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్లి ముందుండి ఉద్యమాలను నడిపి బీజేపీకి క్రేజీ తీసుకువచ్చారు. ఉద్యోగుల 317 జీవో సవరణ ఉద్యమానికి కూడా అండగా నిలిచిన సందర్భం పార్టీకి అదనపు శక్తిగా మారింది. హిందుత్వ నినాదాన్ని బలంగా వినిపిస్తూ యువకుల్లో హిందువుల్లో ఆయన తమ ప్రతినిధి ఇతనే అనే అభిప్రాయాన్ని కల్పించడంలో సక్సెస్‌ అయ్యారు. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఆయనకు కేంద్ర సహాయమంత్రి పదవిని కట్టబెట్టింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు కేంద్రమంత్రి పదవి దక్కడం పట్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఫ ప్రజల అండతోనే కేంద్ర మంత్రి పదవి : బండి సంజయ్‌కుమార్‌

నాపై నమ్మకం ఉంచి రెండోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల కారణంగానే నాకు కేంద్రమంత్రి పదవి లభించిందని, వారందరికీ రుణపడి ఉంటానని మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంత్రి పదవి లభించిన సందర్భంగా ఆయన స్పందిస్తూ కేంద్రమంత్రిగా తనకు లభించిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని చెప్పారు. ఎన్నికల సందర్భంలోనే రాజకీయాలు, వ్యక్తిగత ఆరోపణలు ఉండాలి. ఆ తర్వాత ఆరోపణలను, విమర్శలను పక్కనబెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేయాలని సంజయ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయసహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తానని ఆయన చెప్పారు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *