అపార్ట్మెంట్ లలో ఉండేవారికి అలర్ట్...!
సిటీల్లో అద్దెకు ఉండే ప్రతీ ఒక్కరూ మెయింటెనెన్స్ చార్జీలు అనే మాటను వినకుండా ఉండరు. కిరాయి, కరెంట్ బిల్లుతోపాటు, మెయింటెనెన్స్ చార్జీలను కూడా ప్రతీ నెలా యజమానికి చెల్లించాల్సిందే. అద్దె ఇళ్లతో పోల్చితే అపార్ట్మెంట్ కల్చర్ లోనే ఈ మెయింటెనెన్స్ చార్జీలు అనేది ఎక్కువగా అమలవుతుంటుంది. ప్రతీ అపార్ట్మెంట్ కు ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. ఆ సంఘమే మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేస్తుంటారు. అపార్ట్మెంట్ లో ఏ ఫంక్షన్ అయినా, సమస్య వచ్చినా, క్లీనింగ్ దగ్గర నుంచి విద్యుత్ సరఫరా వరకు ఏదైనా సరే ఆ డబ్బుతోనే చేయిస్తుంటుంటారు. అయితే అపార్ట్మెంట్ లలో సింగిల్, డబుల్, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లు కూడా ఉంటాయి. కొన్నిచోట్ల అందరికీ ఒకే రకమైన మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేస్తుంటారు.
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లో మహా అయితే నలుగురు సభ్యులు కలిగిన కుటుంబం నివసిస్తుంటుంది. డబుల్, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లలో అయితే అంతకుమించే సభ్యులు ఉంటారు. అలాంటప్పుడు అందరికీ కామన్ గా ఓకే మెయింటెనెన్స్ చార్జీలను ఎలా వసూలు చేస్తారన్నదే ప్రశ్న. అయితే అపార్ట్ మెంట్లలో ఉండే అన్ని ప్లాట్ల వారికి ఒకే రకమైన మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేయాలంటూ వీ.శ్రీకాంత్ అనే వ్యక్తి మరొకరితో కలిసి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరంలో గతంలో ఫిర్యాదు చేశారు. అయితే తీర్పు వీరికి అనుకూలంగా వచ్చింది. ఫ్లాట్ చదరపు అడుగులకు బదులుగా ఫ్లాట్ల వారీగా మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేయాలని తీర్పునిచ్చింది. గతంలో వీరి నుంచి అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇండియా బుల్స్ సెంట్రల్ యజమానుల సంక్షేమ సంఘం, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ లో అప్పీల్ చేసింది.దీంతో ఈ ఫిర్యాదుపై విచారించిన రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కీలక తీర్పును మంగళవారం వెల్లడించింది. ముగ్గురు నలుగురు ఉండే కుటుంబానికి, డబుల్, త్రిబుల్ బెడ్రూంలు ఉండే ఫ్లాట్ల కుటుంబాలకు ఒకే రకమైన మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేయడం సమజసం కాదని తెలిపింది. ఫ్లాట్ల విస్తీర్ణాన్ని బట్టే మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేయాలని తీర్పునిచ్చింది. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. నిర్వహణ చార్జీలు- ఏపీ అపార్ట్ మెంట్స్ చట్టం ప్రకారం విస్తీర్ణం వారీగానే మెయింటెనెన్స్ చార్జీలను వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
